సర్వం..శివోహం!
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:20 AM
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శంకరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమఃశివాయ..’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో మార్మోగాయి.
శంకరుడి నామస్మరణతో మార్మోగిన శైవాలయాలు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
శ్రీశైలంలో కమనీయంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం
భక్తులతో కిక్కిరిసిన దక్షిణ కైలాసం ‘శ్రీకాళహస్తి’
కోటప్పకొండలో కొలువుదీరిన 23 విద్యుత్ ప్రభలు
అనంతలో ఏకకాలంలో 15,800 బాణలింగాలకు అభిషేకం
గోదావరి ఘాట్లలో 1.31 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శంకరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమఃశివాయ..’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో మార్మోగాయి. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండతో పాటు అన్ని ఆలయాల్లో విశేషంగా పూజా కార్యక్రమాలు, నేత్రపర్వంగా అభిషేకాలు జరిగాయి. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం రాత్రి పరమేశ్వరుడికి పాగాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలసిన వాయులింగేశ్వర స్వామి నిత్యాభిషేక మూర్తిగా దర్శనమిచ్చారు. ఉదయం, రాత్రి సమయాల్లో శ్రీకాళహస్తీశ్వరుడు, ఆయన దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి పురవిహారం చేశారు. పల్నాడు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల నేత్ర పర్వంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామికి విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టువస్త్రాలు, వెండి ప్రభ సమర్పించారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ప్రభుత్వం చీఫ్ విప్ ఆంజనేయులు పాల్గొన్నారు. కోటయ్య తిరునాళ్లలో 23 భారీ విద్యుత్ ప్రభలు కొలువు తీరాయి. హైకోర్టు జడ్జిలు జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురే్‌షరెడ్డి, జస్టిస్ పీవీ జ్యోతిర్మయి, జస్టిస్ వీ సుజాతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో మహాశివోత్సవం వైభవంగా నిర్వహించారు. దాదాపు 15,800 బాణలింగాలకు భక్తులు ఏకకాలంలో అభిషేకాలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్లలో 1.31 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామ, కోటిపల్లి ఆలయాలు కిటకిటలాడాయి. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. పుణ్యస్నానాలు చేసే భక్తులతో తమ్మిలేరు జనసంద్రంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు క్షీరారామం, గునుపూడి సోమారామం భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆచంటలో ఉమా రామలింగేశ్వరస్వామి రథోత్సవం వైభంగా సాగింది. విజయవాడలోని యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40కి పైగా ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శ్రీశైల మల్లన్నకు పాగాలంకరణ
నంది వాహనంపై విహరించిన ఆది దంపతులు
శ్రీశైల క్షేత్రంలో ఆదివారం రాత్రి మల్లికార్జునుడికి పాగాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుండగా ఆలయ ప్రధాన గోపురంపై కలశానికి తలపాగా చుట్టే కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నవ నందులను కలుపుతూ చేసిన పాగాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్ధరాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్ల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. అంతకుముందు సాయంత్రం జరిగిన ప్రభోత్సవంలో రెండున్నర లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ఆ తర్వాత నంది వాహనంపై అధిష్ఠింపజేసి స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులకు పుష్పార్చన, ఆలయోత్సవం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.



