శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:20 AM
మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా.
రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి.. కిక్కిరిసిన వేములవాడ, కీసర ఆలయాలు
యాదగిరిగుట్టలో శతరుద్రాభిషేకాలు
ఓరుగల్లులో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
వేలాల గట్టుమల్లన్న గుడి వద్ద విషాదం
గుట్టపైకెళ్తూ గుండెపోటుతో భక్తుడి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా. రాజన్న ఆలయాన్ని విస్తరణ పనుల్లో భాగంగా మూసివేయడంతో భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్‌సతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఖమ్మం జిల్లాలోని పలు శివాలయాల్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల పేరిట భట్టి పూజలు నిర్వహించారు. తుమ్మల బుగ్గపాడు విశ్వధర్మ క్షేత్రంలో మహానంది ప్రతిష్టలో పాల్గొన్నారు. కీసరగుట్టకు కూడా భక్తులు పోటెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుల దివ్యక్షేత్రంలో శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు మహాశివరాత్రి ఒక్క రోజే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీలు నడుపుతుండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో వరంగల్‌లోని ప్రసిద్ధ వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం కిటకిటలాడింది. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. మంత్రి కొండా సురేఖ నగరంలో దేవాలయాలను సందర్శించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం వనదుర్గమ్మ క్షేత్రంలో ఏడుపాయల జాతర వైభవంగా ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులతో జాతరకు వచ్చిన అదే జిల్లాకు చెందిన బింగి రాజేందర్(45) అనే భక్తుడు గుట్టపైకి ఎక్కుతూ గుండెపోటుతో మృతిచెందాడు.