Share News

తనకు విడాకులిచ్చి.. రెండో పెళ్లి చేసుకుందని..

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:33 AM

గృహ హింస కేసు పెట్టి, విడాకులిచ్చి, వీసా రాకుండా చేయడమే కాక.. మరో పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తోందనే కక్షతో, విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను హతమార్చాడు.

తనకు విడాకులిచ్చి.. రెండో పెళ్లి చేసుకుందని..

  • మాజీ భార్యను కిరాతకంగా హత్యచేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

  • విదేశాలకు వెళ్లేందుకు వీసా రాకుండా చేసిందని కక్ష

  • ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచి ఘాతుకం

  • హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణ ఘటన

  • మృతురాలు నాలుగు నెలల గర్భిణి.. నిందితుడి అరెస్టు

వనస్థలిపురం/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 18(ఆంధ్ర జ్యోతి): గృహ హింస కేసు పెట్టి, విడాకులిచ్చి, వీసా రాకుండా చేయడమే కాక.. మరో పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తోందనే కక్షతో, విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను హతమార్చాడు. పథకం ప్రకారం పట్టపగలే ఆమె నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. నాలుగు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన దేవరకొండ మహేష్(32)కు మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లా బల్లాపూర్‌ మండలం తిలక్‌వార్డ్‌కు చెందిన బుద్దార్తి సునీత(30)తో 2022లో పెద్దల సమక్షంలో వివాహమైంది. కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన మహేష్‌.. సునీతను కెనడా తీసుకెళ్లాడు. పెళ్లయిన 45 రోజుల తర్వాత నుంచి ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భర్త వేధింపులు భరించలేకపోయిన సునీత కెనడా పోలీసుల సాయంతో స్వదేశం చేరారు. మహారాష్ట్రలోని బరంపురం పోలీస్‌ స్టేషన్‌లో మహే్‌షపై గృహహింస కేసు పెట్టి, విడాకులు కావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2024లో పెద్దల సమక్షంలో మహేష్‌, సునీత దంపతులు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2025 ఏప్రిల్‌లో వనస్థలిపురంలో ఉండే ఉడ్కుల శ్రీనాథ్‌ను సునీత పెళ్లాడారు. శ్రీనాథ్‌, సునీత దంపతులు వనస్థలిపురం గ్రీన్‌సిటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. శ్రీనాథ్‌ తల్లి, తమ్ముడు కూడా వారితోనే ఉంటున్నారు.


తిరిగి విదేశాలకు వెళ్లకుండా చేసిందని కక్ష..

మరోపక్క, ఇటీవల తల్లిని కోల్పోయి మనోవేదనకు గురైనమహేష్‌ తిరిగి కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ సునీత తనపై పెట్టిన కేసులు కారణంగా వీసా మంజూరు కాలేదు. దీంతో సునీతపై కక్ష పెంచుకున్న మహేష్‌ ఆమెను హతమార్చాలని పథకం వేశాడు. సునీత వనస్థలిపురంలో ఉంటున్న విషయం తెలుసుకొని, సమీపంలోని తుర్కయాంజాల్‌లో ఓ ప్రైవేట్‌ హాస్టల్లో చేరాడు. రహస్యంగా సునీత కదలికలపై దృష్టిపెట్టి ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌, ఫ్లాట్‌ వివరాలు తెలుసుకున్నాడు. సునీతను హత్య చేయడానికి రెండు పెద్ద కత్తులు, చెట్లు కోసే రంపం,పెట్రోల్‌ సమకూర్చుకున్నాడు. బుధవారం ఉదయం సెల్ప్‌డ్రైవింగ్‌ కారును అద్దెకు తీసుకున్న మహేష్‌ ఆ సామగ్రిని ఓ బ్యాగులో పెట్టుకొని సునీత ఇంటికి వెళ్లాడు.


గదిలోకి లాక్కెళ్లి కత్తితో పొడిచేశాడు..

సునీత ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న మహేష్‌ నాలుగో అంతస్తులోని ఆమె ఫ్లాట్‌కు వెళ్లాడు. ఐటీ ఉద్యోగి అయిన సునీత వర్క్‌ఫ్రం హోంలో ఉండగా... ఆమె అత్త బాల్కనీలో దుస్తులు ఆరేస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించిన మహేష్‌.. సునీతతో గొడవ పడుతూ ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లాడు. వెంట తెచ్చుకున్న పెద్దకత్తితో సునీత మెడ, తలపై బలంగా కొట్టాడు. సునీత అరుపులు విని ఆమె అత్త కేకలు వేయగా అపార్ట్‌మెంట్‌లోని వారు అక్కడికి చేరుకున్నారు. కానీ, తలమీద తీవ్ర గాయాలవడంతో సునీత ప్రాణాలు విడిచారు. ఇక, తనను పట్టుకోవాలని యత్నించిన అపార్ట్‌మెంట్‌వాసులను తన వద్ద ఉన్న పెట్రోల్‌ డబ్బా చూపించి బెదిరించిన మహేష్‌.. సునీత మరణించిన గదిలోనే తలుపు పెట్టుకున్నాడు. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టగా.. పెట్రోల్‌ మీద పోసుకున్న మహేష్‌ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కానీ, పోలీసులు మహే్‌షను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

మున్సిపల్ కార్యాలయాల్లో తప్పని తిప్పలు

Updated Date - Feb 19 , 2026 | 09:36 AM