స్పోర్ట్స్ కారుతో స్టంట్లు.. చిక్కుల్లో మాజీ అండర్‌వరల్డ్ డాన్ కొడుకు!
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:29 AM
స్పోర్ట్స్ కారుతో స్టంట్స్ చేసిన ఒక వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. పోలీసులు అతడి కారును సీజ్ చేశారు. కారు నడిపిన వ్యక్తి అండర్‌వరల్డ్ మాజీ డాన్ కుమారుడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారుతో వీధుల్లో స్టంట్స్ చేసిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. లంబోర్గిని ఉరకాన్ కారుతో రిక్కీ రాయ్ చేసిన స్టంట్స్ తాలూకు వీడియో ఇటీవల వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడి కారును సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసు వర్గాల కథనాల ప్రకారం, రిక్కీ రాయ్ తండ్రి ముత్తప్ప రాయ్ అండర్ వరల్డ్ మాజీ డాన్. కొంత కాలం క్రితం ఆయన మరణించారు. ఇక తాజా కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు రిక్కీ రాయ్‌కు నోటీసులు కూడా పంపించారు. అయితే, ఆ వాహనం రిక్కీదేనా? లేక ఇతరులదా? అన్నది పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
ఆదివారం అర్ధరాత్రి 2.00 గంటల సమయంలో నగరంలోని అనిల్ కుంబ్లే జంక్షన్ వద్ద రిక్కీ ఈ స్టంట్స్ చేసినట్టు తెలుస్తోంది. కారుతో అతడు డ్రిఫ్టింగ్ చేస్తున్నట్టు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్, ఇతరులను ప్రమాదంలోకి నెట్టడం వంటి అభియోగాలను మోపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నారు. కారు యజమాని వివరాల కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి కూడా పోలీసులు లేఖ రాశారు.
ఈ వార్తలూ చదవండి:
ఏసీ మెకానిక్‌నంటూ ఫ్లాట్‌లోకి చొరబడి..
మద్యం మత్తులో ఘర్షణ.. బండరాయితో మోది వ్యక్తి హత్య