లాయర్ ఇంట్లో చోరీ.. భార్యను కట్టేసి.. 2 కేజీల బంగారం దోచుకుని..
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:59 AM
హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఒక లాయర్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగలు, డబ్బుతో ఉడాయించారు.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఒక లాయర్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగలు, డబ్బుతో ఉడాయించారు. కురుక్షేత్రలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడు, సీనియర్ అడ్వొకేట్ బల్వంత్ సింగ్ వాలియా థానేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితుడి కథనం ప్రకారం, గురువారం రాత్రి పెంపుడు శునకంతో కలిసి బయటకు వెళ్లిన ఆయన 9.30 గంటలకు తిరిగొచ్చేసరికి ఇంట్లో షాకింగ్ దృశ్యం కనిపించింది. అప్పటికి ఇంట్లో ఉన్న దుండగులు ఆయన భార్య చేతులు కాళ్లు కట్టేసి మంచంపై పడేశారు. ఆమె మాట్లాడలేకుండా నోటికి గమ్ టేప్ చుట్టారు. ఆ తరువాత న్యాయవాదిని కూడా గన్నుతో బెదిరించి కదలకుండా తాళ్లతో కట్టేశారు. డిజిటల్ లాకర్‌ను ఓపేన్ చేయలేక ఇబ్బంది పడ్డ దుండగలు లాయర్‌తోనే వాటిని తెరిపించి డబ్బును లాక్కున్నారు. లాకర్‌లు తెరవకుంటే తుపాకీతో కాల్చి చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ న్యాయవాది వారు చెప్పినట్టే చేశారు.
దీంతో, దుండగులు రూ.17-20 లక్షల నగదు, 1.5-2 కేజీల బంగారు నగలు, 4 కేజీల వెండి నగలు, విగ్రహాలు, లైసెన్స్డ్ రివాల్వర్, క్యాట్రిడ్జ్‌లు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. వెళ్లేముందు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. డీవీఆర్‌లను వెంట తీసుకెళ్లారు. మరో రూ.80 లక్షలు ఇవ్వాలని తనను వాళ్లు డిమాండ్ చేశారని పోలీసులకు బాధితుడు తెలిపారు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించి వెళ్లిపోయారని అన్నారు. మార్చిలో తమ ఇంట్లో చోరీ చేసి రూ.50 లక్షలు తీసుకెళ్లామని కూడా వారు చెప్పారని న్యాయవాది పేర్కొన్నారు. దొంగలు వెళ్లాక ఇరుగుపొరుగును అప్రమత్తం చేయడంతో వారు వచ్చి తమను విడిపించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..
డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..