సోషల్ మీడియాలో కోడలి రీల్స్.. అత్తమామల ఆత్మహత్య
ABN , Publish Date - May 14 , 2026 | 08:22 AM
కోడలు తమను వేధిస్తోందంటూ అత్తమామలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో తాజాగా వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కోడలు, ఆమె కుటుంబం తమను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ అత్తమామలు ఆత్మహత్య చేసుకున్నారు. కోడలి లైఫ్ స్టైల్, సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న కంటెంట్ తమను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని ఆరోపించారు. పానిపత్ జిల్లా నారా గ్రామంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, రాజేశ్ (46), సుమన్ (44) దంపతుల కుమారుడు ఆశిష్‌కు గతేడాది వివాహం జరిగింది. అతడిది ప్రేమ వివాహం. రెండేళ్ల క్రితం ఆశిష్‌కు సోషల్ మీడియాలో స్నేహ అనే యువతి పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో వారు 2025లో జనవరిలో పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లి తరువాత ఆ కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. రాజేశ్ దంపతులు గ్రామంలో నివసిస్తుంటారు. ఆ గ్రామంలో జనాలు సంప్రదాయాలకు అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఈ క్రమంలో స్నేహ కురచ దుస్తులతో నిత్యం వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. కోడలి తీరుపై అత్తమామలు అభ్యంతరం చెప్పేవారు.
ఈ క్రమంలో స్నేహ తమపై చేయి చేసుకునేదని కూడా ఆరోపించారు. కోడలు తమపై చేయి చేసుకుంటున్నా తమ కుమారుడు భార్యను ఒక్కమాట కూడా అనలేక పిరికిపందలా చూస్తుండిపోయేవారని కూడా ఆరోపించారు. గత శనివారం రాజేశ్, సుమన్‌లు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై రాజేశ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
వామ్మో నేపాలీలు.. పక్కాగా స్కెచ్ వేసి.. రూ.కోట్లు కొట్టేస్తున్న ముఠాలు
ఏడేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం