ఢిల్లీలో గ్యాంగ్ రేప్ !
ABN , Publish Date - May 15 , 2026 | 04:40 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. దేశాన్నే దిగ్ర్భాంతికి గురి చేసిన ‘నిర్భయ’ ఘటనను తలపిస్తూ మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది.
స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం
టైమ్ అడిగిన మహిళను బస్సులోకి లాగి కిరాతకం
ఆలస్యంగా వెలుగులోకి ఘటన.. నిందితుల అరెస్టు
న్యూఢిల్లీ, మే 14 : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. దేశాన్నే దిగ్ర్భాంతికి గురి చేసిన ‘నిర్భయ’ ఘటనను తలపిస్తూ మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల మహిళపై ఓ ప్రైవేటు స్లీపర్ బస్సులో డ్రైవర్, కండక్టర్‌అత్యాచారానికి పాల్పడ్డారు. న్యూఢిల్లీలో గత సోమవారం(మే 11న) రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. నిందితులిద్దరినీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూఢిల్లీలోని పిటంపురా ప్రాంతానికి చెందిన బాధిత మహిళ(30)కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ పరిశ్రమలో పని చేస్తున్న ఆ మహిళ.. విధులు ముగించుకున్న తర్వాత ఎప్పట్లాగే సోమవారం రాత్రి కూడా ఇంటికి బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో సరస్వతీ విహార్ బ్లాక్-బీ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న ప్రైవేటు స్లీపర్ బస్సు వద్ద ఓ వ్యక్తిని ఆమె గమనించింది. అతని వద్దకు వెళ్లి సమయం ఎంత అని అడిగింది. కానీ, ఆ వ్యక్తి బాధిత మహిళను బస్సులోకి బలవంతంగా లాగి వాహనాన్ని వెంటనే నాంగ్లోయి ప్రాంతం వైపు పోనించాడు. అప్పటికే బస్సులో కండక్టర్ కూడా ఉన్నాడు. బస్సును నాంగ్లోయి మెట్రో స్టేషన్ సమీపంలో ఆపిన డ్రైవర్, కండక్టర్.. బాధితురాలిపై అత్యాచారం జరిపారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 12న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ గ్యాంగ్ రేప్ ఘటనను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. నిర్భయ హత్యాచార ఘటన పునరావృతమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ సామూహిక అత్యాచార ఘటన సమాజానికి మాయని మచ్చని ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.