Share News

మహిళా పోలీస్ కమాండోను కొట్టి చంపిన భర్త! గర్భవతి అని తెలిసీ..

ABN , Publish Date - Jan 29 , 2026 | 02:17 PM

ఢిల్లీతో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త దాడిలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళా పోలీసు కమాండో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మహిళా పోలీస్ కమాండోను కొట్టి చంపిన భర్త! గర్భవతి అని తెలిసీ..
Delhi Police SWAT Commando Killed by Husband

ఇంటర్నెట్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దళం స్వాట్‌లో కమాండోగా ఉన్న కాజల్‌ను (27) ఆమె భర్త అంకుర్ హత్య చేశాడు. నాలుగు నెలల గర్భవతి అయిన ఆమెను అంకుర్ డంబెల్‌తో కొట్టి చంపాడని మృతురాలి తండ్రి ఆరోపించారు (Delhi Police Swat Commando Killed by Husband Over Dowry).

కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు. అంకుర్‌తో పాటు అతడి కుటుంబసభ్యులు కూడా కాజల్‌పై గతంలో పలుమార్లు చేయిచేసుకున్నారని ఆరోపించారు. ‘నా కూతురు గర్భంతో ఉంది. ఆమె భర్త దాడి కారణంగా తల్లీబిడ్డలిద్దరూ మాకు దూరమయ్యారు. అతడు ఒకటి కాదు రెండు హత్యలు చేశాడు’ అని కాజల్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 22న రాత్రి 10 గంటల సమయంలో అంకుర్ భార్యపై ఇష్టారీతిన దాడి చేశాడు. తొలుత నిందితుడు కాజల్ తలను తలుపుకేసి కొట్టి ఆపై డంబెల్‌తో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను నిందితుడు ఆ తరువాత ఆసుపత్రిలో చేర్పించాడు. బాధితురాలు జనవరి 27న ఆసుపత్రిలో కన్నుమూశారు. వారి ఇంటి తలుపు, డంబెల్‌పై రక్తం మరకలను ఫారెన్సిక్ నిపుణులు గుర్తించారు.

2022లో చదువుకునే రోజుల్లో అంకుర్, కాజల్‌కు పరిచయం ఏర్పడింది. చివరకు అది ప్రేమగా మారడంతో ఏడాది తరువాత వారు ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లైన 15 రోజులకే కాజల్‌కు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయని ఆమె సోదరుడు, తండ్రి ఆరోపించారు. కారు, కట్నం కావాలంటూ అత్తింటి వారు వేధింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసుల స్వాట్ విభాగానికి ఎంపికయ్యారు. ఇక అంకుర్ రక్షణ శాఖలో క్లర్క్‌గా చేసేవాడు.


ఈ వార్తలూ చదవండి:

తండ్రి దెబ్బలకు 4 ఏళ్ల బాలిక మృతి.. అంకెలు రాయలేదని కొట్టడంతో..

సంక్రాంతికి వచ్చారు.. దోచుకెళ్లారు!

Updated Date - Jan 29 , 2026 | 02:27 PM