డ్రైవర్ వింటున్నా పట్టించుకోక కారులో ఆ విషయంపై చర్చ! చివరకు..
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:12 PM
తన కారులోని ప్యాసింజర్లు విహారయాత్రకు వెళుతున్నారని గుర్తించిన క్యాబ్ డ్రైవర్ ఆ రాత్రే వారి ఇంట్లో చోరీకి తెగబడ్డ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన కారులో ప్రయాణిస్తున్న కుటుంబం విహార యాత్రకు వెళుతోందని గుర్తించిన ఓ క్యాబ్ డ్రైవర్ చోరికి తెగబడ్డాడు. వారు లేని సమయంలో ఇంటికెళ్లి నగలను దొంగిలించాడు. నిందితుడిని ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మీడియా కథనాల ప్రకారం, బాధితుడు సయ్యద్ అక్రమ్ (67) స్థానికంగా ఓ గాజుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తన కొడుకు, కోడలు, మనవడితో కలిసి భువనేశ్వరి నగర్‌లో ఉంటున్నారు. అయితే, ముంబై పర్యటనకు సిద్ధమైన ఆ కుటుంబం ఫిబ్రవరి 11న యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఒక యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంది. కారులో వెళుతుండగా ఆ కుటుంబం ముంబై టూర్ వివరాల గురించి చర్చించుకున్నారు. ఇదంతా డ్రైవర్ రహ్మన్ జాగ్రత్తగా విన్నాడు. వారు రెండు మూడు రోజుల పాటు ముంబైలో ఉంటారన్న విషయాన్ని గ్రహించి చోరీ చేసేందుకు నిశ్చయించుకున్నాడు. అక్రమ్ కుటుంబాన్ని యథాప్రకారం రైల్వే స్టేషన్ వద్ద దిగబెట్టి వెళ్లిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి తన ప్లాన్‌ను అమలు చేశాడు.
రాత్రి వేళ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో అక్రమ్ ఇంటికి వెళ్లిన రెహ్మాన్ కటికీ చువ్వలను తీసి లోపలకు చొరబడ్డాడు. బెడ్‌రూమ్ కప్‌బోర్డులో ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లిపోయాడు. విహారయాత్ర తరువాత ఫిబ్రవరి 16న తిరిగొచ్చిన అక్రమ్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. చోరీ జరిగిందని గుర్తించాక వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవలే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో మూడు చోరీ కేసులు నమోదయ్యాయని కూడా తెలిపారు. అతడు చోరీ చేసిన 180 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి:
గొడ్డలితో తల్లిపై దాడి.. వరంగల్‌లో దారుణం