చమురే కాదు.. ఎరువులూ భగ్గు
ABN , Publish Date - May 26 , 2026 | 05:47 AM
పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుతో పాటు ఎరువుల ధరలు కూడా ఊహకందని స్థాయికి ఎగబాకాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు....
పశ్చిమాసియా సంక్షోభంతో సామాన్యులు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం
ఇంధనం, ఎరువులు, విదేశీ మారక నిల్వలపై దృష్టి పెంచాల్సి ఉంది..
భారీగా పెరిగిన చమురు, ఎరువులు, బంగారం దిగుమతులతో ఫారెక్స్ నిల్వలకు గండి
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు..
ముంబై: పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుతో పాటు ఎరువుల ధరలు కూడా ఊహకందని స్థాయికి ఎగబాకాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం నిల్వలపై దృష్టి పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొ న్నారు. ముంబైలో సోమవారం జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) 37వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో సీతారామన్ ప్రసంగిస్తూ.. పశ్చిమాసియా సంక్షోభం కేవలం దౌత్య సంబంధమైన లేదా భౌగోళిక రాజకీయ సమస్య కాదన్నారు. ఇది సామాన్య ప్రజానీకం, చిన్న వ్యాపారులపై విస్తృత స్థాయిలో ప్రభా వం చూపనుందని తెలిపారు. అలాగే, భారత్ సహా చాలా దేశాలకు ఈ సంక్షోభం సవాలుగా మారిందన్నారు. ఈ సంక్షోభం మొదలై దాదాపు 90 రోజులు కావస్తుండటంతో ముడి చమురు, ఎరువులు సహా ఇతర కమోడిటీ ధరలు భారీగా పెరిగాయని మంత్రి తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో బంగారం రేట్లూ భారీగా పెరుగుతూ వచ్చాయని, దాంతో పసిడి దిగుమతులు భారంగా మారడంతో పాటు విదేశీ మారకం నిల్వల తరుగుదలకూ కారణమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అందుకే ఇంధనం, ఎరువులు, ఫారెక్స్ నిల్వలపై దృష్టి కీలకంగా మారిందన్నారు. ఎందుకంటే, వ్యాపారాలు, సామాన్యులపై ఇంధన ధరా భారం పెరుగుతోందని, సరుకు రవాణా జాప్యమవడంతో పాటు షిప్పింగ్ ఖర్చులూ పెరిగాయని తెలిపారు. ముడి సరుకులకు కొరత ఏర్పడుతోందని, దాంతో వ్యాపార నిర్వహణ మూలధనంపై ఒత్తిడి పెరిగిందని, ఎగుమతి ఆర్డర్లపై అనిశ్చితి పెరిగిందన్నారు. ఈ పరిణామం చిన్న సంస్థల వ్యాపార ప్రణాళికకు సవాలుగా మారిందన్నారు.
ఎంఎస్ఎంఈలకు చెల్లింపుల్లో జాప్యం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)కు రూ.8.1 లక్షల కోట్ల మేరకు చెల్లింపులు జాప్యమయ్యాయని, ఇది వారి నిర్వహణ మూలధనం, వ్యాపార వృద్ధిపై ప్రభావం చూపుతోందని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. కాబట్టి, ఎంఎ్‌సఎంఈలకు నిర్దేశిత 45 రోజుల గడువుకు మించకుండా చెల్లింపులు జరపాలని ప్రభుత్వ రంగ సంస్థలను కోరారు. దేశీయ ఎంఎ్‌సఎంఈ రంగం 32 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని, ఈ రంగానికిచ్చే ఆర్థిక సహకారం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.
రుణాల తిరిగి చెల్లింపులను రీడిజైన్ చేయండి..
సిడ్బీతో పాటు ఇతర బ్యాంకులు ఆయా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రుణాల తిరిగి చెల్లింపుల తీరును డిజైన్ చేయాల్సిన అవసరం ఉందని సీతారామన్ అన్నారు. ‘‘ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే రుణాలను నెలవారీ కిస్తీ (ఈఎంఐ) రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. సూక్ష్మ రుణాలను వారానికి కొంత చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రైతు సంబంధిత సంస్థకు ప్రతి నెలా ఆదాయం రాదు.. రిసార్టుల వ్యాపారం ఏడాది పొడవునా ఒకే స్థాయి ఆదాయం పంచదు. వస్త్ర ఎగుమతిదారు సరఫరా చేసిన సరుకు కస్టమరుకు చేరేవరకు తనకు రావాల్సిన సొమ్ము కోసం వేచి చూడాల్సి ఉంటుంద’’న్నారు. అలాంటప్పుడు అందరికీ రుణాల తిరిగి చెల్లింపులకు ఒకే నిబంధన ఎందుకని మంత్రి ప్రశ్నించారు. ఆయా పరిశ్రమ లేదా వ్యాపారాలకు భారీగా ఆదాయం లభించే నెలలు లేదా సమయంలోనే తిరిగి చెల్లింపులు జరిపే వెసులుబాటుతో కూడిన రుణాలను ఆఫర్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
సుంకం తగ్గింపుతో ఖజానాకు రూ.లక్ష కోట్ల గండి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అసాధారణ స్థాయికి పెరిగినప్పటికీ, సామాన్యులపై భారం పడనీయకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రభుత్వం రూ.లక్ష కోట్ల వార్షికాదాయాన్ని కోల్పోయిందని సీతారామన్ అన్నారు. అయితే, గడిచిన 11 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగోసారి పెంచడాన్ని మంత్రి సమర్థించుకున్నారు. ముడిచమురు ధరలు ఎంతకీ దిగిరాకపోవడంతో నష్టాలు భరించలేని స్థాయికి పెరిగిపోవడం వల్లే ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు.
ప్రజల్ని భయపెట్టొద్దు..
ఈ యుద్ధ సంక్షోభ కాలంలో విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయవద్దని, పెట్రోల్, డీజిల్, వంటనూనెల వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని, విదేశీ పర్యటనలను మానుకోవాలని, ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచే పనిచేయాలని ప్రధాని మోదీ ఈ మధ్యనే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు, వ్యతిరేకులు విషపూరిత, నిరాశావాదపూరిత కథనాలను సృష్టిస్తున్నారని, వారి వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని సీతారామన్ అన్నారు. వారి కథనాలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేసేలా ఉన్నాయని, అది సరికాదన్నారు. ఈ దశలో భారత్‌కు ఇది తగదన్నారు. ఈ సమయంలో మన వ్యాఖ్య లు, చర్యలతో ప్రజల్లో విశ్వాసం నింపాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఆర్‌సీఎం విధానాన్ని పునఃసమీక్షించండి
వరంగల్ వ్యవసాయం (ఆంధ్రజ్యోతి):కాటన్ పరిశ్రమకు సంబంధించి రివర్స్ చార్జి మెకానిజం (ఆర్‌సీఎం) విధానాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ముంబైలో జరిగిన కాటన్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రికి రవీందర్ రెడ్డి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఆర్‌సీఎం వల్ల వర్కింగ్ క్యాపిటల్ సమస్య వస్తోందని ఆయన తెలిపారు. జీఎ్‌సటీ ప్రకారం రైతుల నుంచి ముడి పత్తిని కొనుగోలు చేసిన వెంటనే జిన్నింగ్ పరిశ్రమలు 5 శాతం పన్నును చెల్లించాల్సి వస్తోందన్నారు. అలాగే కొనుగోలు చేసిన పత్తి అమ్ముడై, సొమ్ము చేతికి రావడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని మంత్రికి వివరించారు. అయితే పత్తిని కొనుగోలు చేసిన వెంటనే జీఎ్‌సటీని చెల్లించటంతో పరిశ్రమలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని రవీందర్ తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఈ వార్తలనూ చదవండి:
రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్