Share News

ఫోక్స్‌వ్యాగన్‌ సంచలనం.. లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:19 AM

ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ స్థాయిలో పునర్ వ్యవస్థీకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మొత్తం లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది.

ఫోక్స్‌వ్యాగన్‌ సంచలనం.. లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం
Volkswagen Job cuts

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ స్థాయిలో పునర్ వ్యవస్థీకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మొత్తం లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ సూపర్‌వైజరీ బోర్డు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే సంస్థ 50 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. దీనికి అదనంగా మరో 50 వేల మందిని తొలగించేందుకు బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది. కార్మిక సంఘాలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు తెలిపింది. సుంకాల భారం, ఆసియా సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ, అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యం ఉన్న నేపథ్యంలో పునర్ వ్యవస్థీకరణకు ఫోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది.


ఫోక్స్‌వ్యాగన్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇచ్చిన పునర్ వ్యవస్థీకరణ ప్లాన్‌కు సూపర్‌వైజరీ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న సిబ్బంది వ్యవస్థలో మౌలిక స్థాయి మార్పుల అవసరం ఉందని ఫోక్స్‌వ్యాగన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, లక్ష మంది తొలగింపు ఏయే సమయాల్లో చేపడతారనే విషయంపై సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. ఏ ప్రాంతాలు, విభాగాల్లో తొలగింపులు ఉంటాయన్న దానిపై కూడా స్పష్టత కొరవడింది.

ఫోక్స్‌వ్యాగన్ బోర్డు, సంస్థలో మెజారిటీ షేర్ హోలర్డ్ పోర్షే ఎస్ఈ సంస్థ, కార్మిక సంఘాల మధ్య ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. పునర్ వ్యవస్థీకరణ ప్లాన్‌ను ఆమోదింపజేసుకునేందుకు ఒకానొక సమయంలో సంస్థ జనరల్ మీటింగ్‌కు కూడా సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


చైనా సంస్థల నుంచి గట్టిపోటీ..

2025 నాటికి ఫోక్స్‌వ్యాగన్‌కు ప్రపంచవ్యాప్తంగా 6.6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. బెంట్లే, లాంబోర్ఘినీ వంటి ప్రముఖ కార్లను సంస్థ తయారు చేస్తోంది. అయితే, ఇటీవల కాలంలో సంస్థ లాభాలు తగ్గాయి. చైనా కంపెనీల నుంచి పోటీ పెరగడం సంస్థపై ప్రతికూల ప్రభావం చూపించింది. ట్రంప్ సర్కారు సుంకాల కారణంగా అమెరికాలో ఫోక్స్‌వ్యాగన్ కార్ల విక్రయాలు కూడా తగ్గాయి. కొత్త టెక్నాలజీలని అందిపుచ్చుకుంటున్న చైనా కంపెనీలకు ఉత్పత్తి ఖర్చులు కూడా తక్కువగా ఉండటం కలిసొస్తోందని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. చైనా సంస్థ బీవైడీ కార్ల అమ్మకాలు యూకే, ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల్లో గణనీయంగా పెరిగాయని అంటున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

2028 నాటికి మార్కెట్లో 10శాతం వాటా లక్ష్యం: ఎస్‌ఎంఎల్‌ మహీంద్రా ప్రెసిడెంట్‌

స్టాక్ మార్కెట్.. నాలుగో రోజూ నష్టాలే!

Updated Date - Sep 04 , 2026 | 10:40 AM