యూపీఐ లావాదేవీల్లో జోరు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:29 AM
యూపీఐ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. మొదటిసారిగా అక్టోబరు నెలలో యూపీఐ లావాదేవీలు 2,500 కోట్ల మార్క్‌ను...
అక్టోబరులో 2,547 కోట్లుగా నమోదు.. విలువ రూ.31.53 లక్షల కోట్లు
ముంబై: యూపీఐ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. మొదటిసారిగా అక్టోబరు నెలలో యూపీఐ లావాదేవీలు 2,500 కోట్ల మార్క్‌ను దాటాయి. అలాగే రోజువారీ సగటు లావాదేవీల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్లను దాటడం గమనార్హం. మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) చార్జీలను విధించడంపై ఓ వైపు చర్చ జరుగుతున్న తరుణంలో ఈ స్థాయిలో డిజిటల్ చెల్లింపులు పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబరులో 2,547 కోట్ల లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. వీటి విలువ రూ.31.53 లక్షల కోట్లు. సెప్టెంబరులో రూ.29.37 లక్షల కోట్ల విలువైన 2,407 కోట్ల లావాదేవీలు జరిగాయి. నెలవారీగా చూస్తే లావాదేవీల పరిమాణం 5.8 శాతం పెరగ్గా.. చెల్లింపుల విలువ 7.4 శాతం వృద్ధి చెందింది. రోజువారీ సగటు లావాదేవీలూ పెరిగాయి. సెప్టెంబరులో రోజువారీ సగటు లావాదేవీలు 80.2 కోట్లు ఉండగా.. అక్టోబరులో 2.5 శాతం పెరిగి 82.2 కోట్లకు చేరాయి. అలాగే రోజువారీ సగటు లావాదేవీల విలువ 3.9 శాతం వృద్ధితో రూ.97,913 కోట్ల నుంచి రూ.1,01,707 కోట్లకు చేరుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన అక్టోబరులో లావాదేవీల పరిమాణం 23 శాతం పెరిగింది. విలువ వృద్ధి మాత్రం 18 శాతం నుంచి 16 శాతానికి తగ్గింది.
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..