ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు!
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:22 AM
తమ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) వద్ద కస్టమర్లు యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే...
గరిష్ఠంగా రూ.2,000 వరకు అనుమతి
న్యూఢిల్లీ: తమ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) వద్ద కస్టమర్లు యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత విధానం ద్వారా ఫోన్, పీఓఎస్ రెండింటికీ ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు చేసే అవకాశం కలగనుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎ్‌ఫసీ) టెక్నాలజీ సదుపాయం ఉన్న ఫోన్‌ను పీఓఎస్ టెర్మినల్ వద్ద టాప్ చేసి యూపీఐ లైట్ బ్యాలెన్స్ నుంచి గరిష్ఠంగా రూ.2,000 వరకు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉండని విమాన క్యాబిన్లు, భూగర్భ రైలు నెట్‌వర్క్స్ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ విధానానికి సంబంధించి ప్రముఖ టెర్మినల్ మాన్యుఫ్యాక్చరర్లు తయారు చేసిన పీఓఎస్ డివైజ్‌లను సర్టిఫై చేసే ప్రక్రియను ఈ ఏడాదిలోనే ఎన్‌పీసీఐ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నెట్ ఉన్నప్పుడు కస్టమర్లు తమ ఫోన్‌లోని యూపీఐ లైట్ వ్యాలెట్‌లో సొమ్మును లోడ్ చేసుకోవాలి. ఆ సొమ్మును ఆఫ్‌లైన్ టెర్మినల్ వద్ద యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయకుండానే చెల్లింపులు చేసేయవచ్చు. ఈ లావాదేవీని టెర్మినల్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతుందో అప్పుడు దాన్ని వెరిఫికేషన్ కోసం పంపుతుంది. ఆఫ్‌లైన్‌లో యూపీఐని అనుమతించేందుకు పీఓఎస్ కంపెనీలు ఎన్‌పీసీఐ నుంచి సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. బ్యాంకులు, థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ ప్రొవైడర్లు తమ యాప్‌లలో ఈ సదుపాయాన్ని కల్పించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!