కేంద్ర బడ్జెట్ 2026.. కొత్తగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:02 AM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026‑27ను ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026‑27ను ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రారంభమైంది. వరుసగా 9వ సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
వికసిత్ భారత్ దిశగా అడుగులు..
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ‘7శాతం గ్రోత్ రేట్‌తో ముందుకు సాగుతున్నాం. వికసిత్ భారత్ దిశగా అడుగులు ముందుకేస్తున్నాం. ఈ బడ్జెట్.. యువశక్తి బడ్జెట్. ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేలా బడ్జెట్‌ను సిద్ధం చేశాం. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులున్నా ముందుకెళ్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకుసాగుతాం. భవిష్యత్‌లో ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుంటాం. ప్రజల ఆకాంక్షలను అందుకోవడమే లక్ష్యం. నిలకడగా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు’..
కొత్తగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు
‘కొత్తగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్-పుణె, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి మధ్య కారిడార్లు ఏర్పాటు చేస్తాం. దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. దేశంలో మెడికల్ హబ్‌లు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ సెక్టార్‌తో కలిసి మెడికల్ హబ్‌లు ఏర్పాటు చేస్తాం. మూడు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తాం. సాంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తాం’..
జీఎస్టీ, లేబర్ కోడ్ రంగాల్లో సంస్కరణలు
‘ఇది ప్రధాని ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్. మోదీ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోంది. ప్రజల సుస్థిర అభివృద్ధికి ప్రధానంగా 3 కర్తవ్యాలు ఉన్నాయి. సమ్మిళిత అభివృద్ధి, వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, సబ్ కా సాత్ సబ్ కా వికాస్. ఆర్థిక అభివృద్ధి కోసం 6 అంశాలపై ఫోకస్ పెట్టాం. పారిశ్రామికాభివృద్ధి, ఎమ్‌ఎస్‌ఎమ్ఈలను ఛాంపియన్ చేయడం, నిర్మాణాత్మక లక్ష్యాలతో వీటిని సాధిస్తాం. 2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకొచ్చాం. జీఎస్టీ, లేబర్ కోడ్ తదితర రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తాం’..
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2లక్షల కోట్లు
‘ఉపాధి కల్పనకు పెద్దపీఠ వేస్తున్నాం. దేశంలో కొత్త 3 NIPERలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం ఉన్న NIPERలను ఆధునీకరిస్తాం. ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తాం. దేశంలో కొత్తగా మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాటు చేస్తాం. ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహకానికి కొత్త పథకం తీసుకువస్తాం. 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూతనిస్తాం. నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం ఏర్పాటు చేస్తాం. కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10వేల కోట్లు.. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2లక్షల కోట్లు కేటాయించాం’..
తొలిసారిగా ఆదివారం బడ్జెట్
భారత దేశ చరిత్రలో తొలిసారిగా ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా సెలవు రోజుల్లో బడ్జెట్‌లను ప్రవేశపెట్టలేదు. సాధారణ పని దినాల్లో మాత్రమే బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. 1999లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం వచ్చింది. దీంతో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా.. దానికి ఒకరోజు ముందే.. అంటే ఫిబ్రవరి 27వ తేదీ శనివారం రోజున పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కొన్నేళ్ల క్రితమే ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రవేశపెట్టేలా మార్పులు తెచ్చారు.
ఇవి కూడా చదవండి
బడ్జెట్ 2026: అందరి ఆసక్తి ఈ అంశాలపైనే..
కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్