Share News

‘టీవీఎస్‌లో ఇంటిపోరు!

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:02 AM

టాటా ట్రస్ట్‌లు, టాటా సన్స్‌ బోర్డు మధ్య జరుగుతున్న నాయకత్వ పోరులో నోయల్‌ టాటాతో విబేధిస్తున్న వేణు శ్రీనివాసన్‌కు మరోపక్క ఇంటిపోరు కూడా మొదలైంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ...

‘టీవీఎస్‌లో ఇంటిపోరు!

యాజమాన్య హక్కులు, వారసత్వ ఏర్పాట్లపై వేణు శ్రీనివాసన్‌ పిల్లల మధ్య విబేధాలు

న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్‌లు, టాటా సన్స్‌ బోర్డు మధ్య జరుగుతున్న నాయకత్వ పోరులో నోయల్‌ టాటాతో విబేధిస్తున్న వేణు శ్రీనివాసన్‌కు మరోపక్క ఇంటిపోరు కూడా మొదలైంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్‌ మోటార్‌, దాని హోల్డింగ్‌ కంపెనీ టీవీఎస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ గౌరవ చైర్మన్‌ అయిన వేణు శ్రీనివాసన్‌ పిల్లల మధ్య యాజమాన్య హక్కులు, వారసత్వ ఏర్పాట్లకు సంబంధించి తీవ్ర విబేధాలు వెలుగుచూశాయి. వేణు శ్రీనివాసన్‌ భార్య, ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టాఫే) చైర్మన్‌ మల్లికా శ్రీనివాసన్‌.. ఈ సమస్యను సామరస్యంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించుకోవాలని తన పిల్లలను కోరుతున్నట్లు తెలిసింది. శ్రీనివాసన్‌ దంపతుల కుమారుడైన సుదర్శన్‌ వేణు ప్రస్తుతం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ చైర్మన్‌, ఎండీగా ఉన్నా రు. టీవీఎస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కూ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇక కుమార్తె లక్ష్మీ వేణు టీవీఎస్‌ హోల్డింగ్స్‌ ఎండీ, సుందరం క్లేటాన్‌ ఎండీ, టాఫే వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు.

2025 ఏప్రిల్‌ నుంచే మొదలు..

2025 ఏప్రిల్‌లో టీవీఎస్‌ హోల్డింగ్స్‌ ట్రస్ట్‌ల నిర్మాణం ద్వారా సుదర్శన్‌ వేణును కంపెనీలో మెజారిటీ లబ్ధిదారుగా ప్రకటించింది. దాంతో లక్ష్మీ వేణు కంపెనీలో సమాన హక్కులు కోరడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. అలాగే, కుటుంబ సంపదను కూడా సమానంగా పంచాలని, ఈ విషయంపై చర్చించాలని ఆమె చాలా కాలంగా కోరుతున్నట్లు తెలిసింది. టీవీఎస్‌ హోల్డింగ్స్‌ వార్షిక నివేదిక ప్రకారం.. కంపెనీలో 74.5 శాతం వాటాను కుటుంబ సభ్యులు/ప్రమోటర్లు కలిగి ఉన్నారు. అందులో 66.55 శాతం వాటాను వేణు శ్రీనివాసన్‌.. టీవీఎస్‌ ట్రస్ట్‌ల ద్వారా కలిగి ఉన్నారు.


2024 మార్చిలో ఎంఓయూ

వ్యాపారాల సెటిల్‌మెంట్‌కు సంబంధించి 2024 మార్చిలో కుటుంబసభ్యుల మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. అయితే, ఇది ఆయా వ్యాపారాల్లో టీవీఎస్‌ బ్రాండ్‌ను ఉపయోగించుకోవడం, నాన్‌-కంపీట్‌ (ఒకరితో మరొకరు పోటీపడవద్దన్న) ఒప్పందం మాత్రమేననీ.. ఆస్తుల పంపకానికి సంబంధించినది కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆస్తుల పంపకంపై ఈ కుటుంబం ఇంకా ఒప్పందానికి రావాల్సి ఉందన్నారు.

గ్రూప్‌ నేపథ్యమిదీ..

టీవీ సుందరమ్‌ అయ్యంగార్‌ 1911లో టీవీఎస్‌ గ్రూప్‌ను ప్రారంభించారు. దక్షిణ భారతంలోని అతిపెద్ద కుటుంబ వ్యాపారాల్లో ఒకటైన టీవీఎస్‌ గ్రూప్‌ వ్యాపారాలను ప్రస్తుతం మూడు, నాలుగోతరం కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. వ్యాపారాల పంపకాల్లో భాగంగా మూడో తరానికి చెందిన వేణు శ్రీనివాసన్‌కు టీవీఎస్‌ మోటార్‌, సుందరం క్లేటాన్‌ లభించాయి. శ్రీనివాసన్‌ ఈ వ్యాపారాల పగ్గాలను ఇప్పటికే పిల్లలకు అప్పగించి గౌరవ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..

ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 11 , 2026 | 06:02 AM