యూఎస్‌కు తగ్గని భారత్ ఎగుమతులు
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:51 AM
అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌పై సుంకాల కొరడా ఝళిపించినా ఆ దేశం భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గానే కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించినప్పటికీ మన దేశ ఎగుమతుల్లో...
ట్రంప్ సుంకాలు విధించినా యూఎస్‌కు తగ్గని భారత్ ఎగుమతులు
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌పై సుంకాల కొరడా ఝళిపించినా ఆ దేశం భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గానే కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించినప్పటికీ మన దేశ ఎగుమతుల్లో అమెరికా వాటా పెద్దగా మారలేదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూలైతో ముగిసిన ఏడాది కాలానికి భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 20 శాతంగా ఉంది. ఇదే కాలంలో ఒక దశలో భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో టారిఫ్ రేటు 18 శాతానికి తగ్గగా.. ఇప్పుడు 10 శాతంగా ఉంది. 2022-23లో భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 17.4 శాతం ఉంది. ఇది క్రమంగా పెరుగుతూ దాదాపు 20 శాతానికి చేరింది. దీన్ని బట్టి అమెరికాపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం కష్టమేనని తెలుస్తోంది.
భారత్ కు అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం అమెరికా
జూలైతో ముగిసిన పన్నెండు నెలల కాలంలో అమెరికాకు భారత్ 8,850 కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇదే కాలంలో చైనాకు ఎగుమతులు 2,150 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతి గమ్యస్థానాల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. ఈ దేశానికి 8,731 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 8,651 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అమెరికా తర్వాత యూఏఈ 3,737 కోట్ల డాలర్లతో రెండో అతిపెద్ద గమ్యస్థానంగా నిలిచింది. 1,948 కోట్ల డాలర్లతో చైనా తర్వాతి స్థానంలో ఉంది. జూలైతో ముగిసిన 12 నెలల కాలంలో చైనాకు భారత్ ఎగుమతులు 42 శాతం మేర పెరిగాయి. ఇతర ప్రధాన మార్కెట్లలో నెదర్లాండ్స్ (1,750 కోట్ల డాలర్లు), యూకే (1,344 కోట్ల డాలర్లు), ఈయూ (7,240 కోట్ల డాలర్లు) ఉన్నాయి. భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల శ్రేణిని మరింతగా విస్తరించింది.
ముఖ్యంగా ఎలక్ర్టానిక్స్, ఇంజనీరింగ్, సముద్ర ఉత్పత్తుల్లో దాదాపు 500 ప్రొడక్ట్‌లను జత చేసింది. మనదేశ ఎలక్ర్టానిక్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఫార్మాసూటికల్స్, రత్నాభరణాలు, టెక్స్‌టైల్స్ ఎగుమతులకు అమెరికా ముఖ్యమైన మార్కెట్‌గా ఉంటోంది. ఇక అమెరికా, భారత్ మధ్య కొన్ని నెలలుగా వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చలు ఇంకా ముగియలేదు. మరోవైపు మన దేశం నుంచి టాంజానియా, వియత్నాం, దక్షిణ కొరియా, శ్రీలంక, కెన్యా వంటి పలు చిన్న మార్కెట్లకు ఎగుమతుల్లో బలమైన వృద్ధి నమోదైంది. అయితే వీటి మొత్తం వాటా అమెరికా కన్నా చాలా తక్కువగా ఉంటోంది.
2025-26లో భారత ఎగుమతులు
అమెరికా: 20%
యూరోపియన్ యూనియన్ (ఈయూ): 16%
గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ (జీసీసీ): 13%
ఆసియాన్: 9ు జూయూఏఈ: 8%
ఇతర దేశాలు: 34%
ఈ వార్తలనూ చదవండి: