Share News

యాపిల్‌పై టిమ్ కుక్ చెరగని ముద్ర! 4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా..

ABN , Publish Date - Aug 31 , 2026 | 08:27 AM

యాపిల్ సంస్థ సీఈఓగా టిమ్ కుక్ నేడు తప్పుకోనున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తరువాత సంస్థలో టిమ్ కుక్ అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించారని పరిశీలకులు చెబుతున్నారు.

యాపిల్‌పై టిమ్ కుక్ చెరగని ముద్ర! 4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా..
Tim Cook

ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ సంస్థ సీఈఓగా టిమ్ కుక్ నేడు తప్పుకోనున్నారు. యాపిల్ రోజువారి కార్యకలాపాల నుంచి తప్పుకున్నప్పటికీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు యాపిల్‌ను కుక్ ముందుండి నడిపించారు. స్టీవ్ జాబ్స్ తరువాత సంస్థలో అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించారు. యాపిల్ మార్కెట్ విలువను ఏకంగా 25 రెట్లు పెంచి తన సత్తా చాటారు. యాపిల్‌ను అత్యంత సంపన్న కంపెనీల్లో ఒకటిగా నిలిపారు.

స్టీవ్ జాబ్స్‌కు వారసుడిగా..

యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ నుంచి కుక్ సంస్థ పాలనా పగ్గాలను అందుకున్నారు. సీఈఓగా ఆయన సామర్థ్యంపై మొదట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ 15 ఏళ్ల కాలంలో కుక్ వాటిని పటాపంచలు చేశారు. స్టీవ్ జాబ్స్ తప్పుకునే నాటికి 350 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఉన్న యాపిల్‌ను 4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దారు. టిక్ కుక్‌ సీఈఓగా ఉన్న సమయంలో సంస్థ షేర్ల విలువ ఏకంగా 2359 శాతం పెరిగిందంటే ఆయన నాయకత్వం ఎంతటి విలక్షణమైనదో అర్థం చేసుకోవచ్చు.


కుక్ హయాంలో యాపిల్ కళ్లు చెదిరే ప్రగతి సాధించింది. అనేక పోటీ సంస్థలు వచ్చినా యాపిల్ తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగింది. ఐఫోన్‌కు ఉన్న జనాదరణతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లు, సర్వీసెస్ విభాగం కార్యకలాపాల విస్తరణ యాపిల్‌ను మేటి సంస్థగా నిలిపాయి.

స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సంస్థలో యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే వంటి విభాగాలను చోదక శక్తులుగా తీర్చిదిద్దిన ఘనత టిమ్ కుక్‌దేనని నిపుణులు చెబుతారు. సేవల విభాగం ద్వారా యాపిల్‌కు ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లలకు పైగా ఆదాయం వస్తోంది. హార్డ్‌వేర్ విభాగంతో పోలిస్తే మరింత మెరుగైన లాభాలను అందిస్తోంది.

హార్డ్‌వేర్ విభాగంలో కూడా టిమ్ కుక్ తనదైన ముద్ర వేశారు. కంప్యూటర్ చిప్స్ కోసం ఇంటెల్‌పై అధికంగా ఆధారపడే స్థాయి నుంచి సొంతంగా చిప్స్‌ను తయారు చేసుకునే స్థాయికి యాపిల్‌ను తీర్చిదిద్దారు. దీంతో, కంప్యూటర్ పనితీరు, నూతన ఉత్పత్తుల అభివృద్ధి, హార్డ్‌వేర్-సాఫ్ట్‌వేర్ అనుసంధానంపై యాపిల్‌కు మరింత పట్టుచిక్కింది. యాపిల్ వాచ్, యాపిల్ ఎయిర్‌పాడ్, ఎయిర్‌ట్యాగ్, యాపిల్ విజన్ ప్రో వంటి ఉత్పత్తులు కూడా కుక్ సారథ్యంలోనే ప్రారంభమయ్యాయి.


అపజయాలు కూడా..

యాపిల్‌కు సారథిగా అనేక విజయాలు అందుకున్న కుక్ కొన్ని అనూహ్య వైఫల్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన సారథ్యంలో 2012లో యాపిల్ మ్యాప్స్‌ ప్రారంభమైంది. అయితే, మ్యాప్స్‌లో కచ్చితత్వం లోపించిందన్న విమర్శను తొలినాళ్లల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈవీ, స్వయంచాలిత వాహనాల కేటగిరీలోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో కుక్ హయాంలో ప్రాజెక్ట్ టైటన్‌ ప్రారంభమైంది. అయితే, ఖర్చులు పెరిగిపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా ఈ ప్రాజెక్టుకు సంస్థ మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టింది.


ఏఐతో యుగంలో సవాళ్లు..

ఈ ఏఐ యుగంలో యాపిల్ ఉత్పత్తుల్లో కృత్రిమ మేధను ఇంటిగ్రేట్ చేయడమే సంస్థ ముందున్న అతిపెద్ద సవాలని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, వంటి సంస్థలు తమ ఉత్పత్తుల్లో ఏఐకి పెద్ద పీట వేస్తున్నాయి. యాపిల్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. యూజర్ల ప్రైవెసీ వంటి అంశాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోంది. ఈ ఏఐ జమానాలో యాపిల్‌కు దిశానిర్దేశం చేయడం తదుపరి సీఈఓ జాన్ టర్నెస్ ముందున్న భారీ సవాలని పరిశీలకులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఈవీ మార్కెట్లో టాటా జోరు

సదరన్‌ ట్రావెల్స్‌కు గ్లోబల్‌ టూరిజం అవార్డు

Updated Date - Aug 31 , 2026 | 08:43 AM