Share News

బోణీ బాగుంది..

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:11 AM

కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాల సీజన్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) శుభారంభం పలికింది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి మార్కెట్‌ అంచనాలకు మించి...

బోణీ బాగుంది..

అంచనాలను మించిన టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు

క్యు4 లాభం రూ.13,718 కోట్లు, ఆదాయం రూ.70,698 కోట్లు

వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్‌

ఈ నెల 1 నుంచి ఉద్యోగులకు వేతనం పెంపు

ముంబై: కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాల సీజన్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) శుభారంభం పలికింది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి మార్కెట్‌ అంచనాలకు మించి రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.12,224 కోట్లతో పోలిస్తే ఇది 12.22ు అధికం. అంతేకాదు, 2025-26 డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి ఆర్జించిన రూ.10,657 కోట్లతో పోల్చితే లాభం ఏకంగా 29ు పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్‌ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9.64ు వృద్ధితో రూ.70,698 కోట్లకు పెరిగింది. 2024-25లో ఇదే కాలానికి కంపెనీ ఆదాయం రూ.64,479 కోట్లుగా ఉంది.

ఆంథ్రోపిక్‌ విధ్వంసం తర్వాత తొలి ఫలితాలు..

అమెరికన్‌ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌ కొత్త టూల్స్‌ సంప్రదాయ ఐటీ కంపెనీల సేవల విధులను పూర్తి గా యాంత్రీకరించనున్నాయని, దాంతో ఐటీ రంగ అవసరం తగ్గిపోనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ భయాలకుు తోడు పశ్చిమాసియాలో యుద్ధం, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రకటించిన తొలి ఆర్థిక ఫలితాల్లో కంపెనీ మెరుగైన పనితీరు కనబరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

వార్షికాదాయం రూ.2.67 లక్షల కోట్లు

గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి టీసీఎస్‌ నికర లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. 2024-25లో నమోదైన రూ.48,553 కోట్లతో పోలిస్తే లాభం 1.35ు పెరిగింది. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.58ు వృద్ధితో రూ.2.67 లక్షల కోట్లకు చేరుకుంది.


మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని విభాగాలు, స్థాయిల ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంత పెంచుతున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. గత ఏడాది సెప్టెంబరులో టీసీఎస్‌ ఉద్యోగుల వేతనాలను 4.5-7ు శ్రేణిలో పెంచింది.

  • క్యూ2, క్యూ3లో తగ్గుతూ వచ్చిన కంపెనీ ఉద్యోగుల సంఖ్య.. గడిచిన మూడు నెలల్లో నికరంగా 2,356 పెరిగి 5,84,519కి చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం 23,460 తగ్గింది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ 12,000 ఉద్యోగాలకు కోత పెట్టడం ఇందుకు కారణం.

  • క్యూ4లో టీసీఎస్‌ కృత్రిమ మేధ (ఏఐ) సేవల విభాగం ఆదాయం 230 కోట్ల డాలర్లు దాటింది. ఏఐ పరిష్కారాలకు మార్కెట్లో భారీ గిరాకీ ఇందు కు దోహదపడింది. కంపెనీ ఏఐ రెవెన్యూ వివరాలను వెల్లడించడం వరుసగా ఇది మూడోసారి. క్యూ3లో ఇది 180 కోట్ల డాలర్లుగా నమోదైంది. కంపెనీ ఇప్పటివరకు 5,500 ఏఐ ప్రాజెక్టులను చేపట్టింది. కాగా, క్యూ3లో 13.5 శాతంగా నమోదైన ఉద్యోగుల వలసల (ఆట్రీషన్‌) రేటు క్యూ4లో 13.7 శాతానికి పెరిగింది.

- ఐటీ రంగంలో అనిశ్చితుల నేపథ్యంలోనూ టీసీఎస్‌ గడిచిన మూడు నెలల్లో 1,200 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ దక్కించుకుంది. దాంతో 2025-26 లో లభించిన కాంట్రాక్టుల మొత్తం విలువ 4,070 కోట్ల డాలర్లకు చేరుకుంది.

వాటాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేరుకు రూ.31 తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. కంపెనీ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్లు ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంటుంది. వార్షి క సమావేశం ముగిసిన మూడో రోజున సంస్థ డివిడెండ్‌ చెల్లింపులు జరుపనుంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను షేర్‌హోల్డర్లకు చెల్లించిన మొత్తం డివిడెండ్‌ రూ.39,571 కోట్లకు చేరుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన వృద్ధిని కనబరచడం వరుసగా ఇది మూడోసారి. అన్ని మార్కెట్లు, సేవల విభాగాల్లోనూ సంస్థ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఆర్థిక ప్రతికూలతల్లోనూ టెక్నాలజీ పెట్టుబడులపై కస్టమర్లు విశ్వాసంగా ఉండటం భవిష్యత్‌ అవకాశాల్లో కంపెనీని మెరుగైన స్థానంలో నిలబెట్టనుంది.


కే కృతివాసన్‌, టీసీఎస్‌ సీఈఓ

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 03:12 AM