చంద్ర నియామకం చెల్లదు ..
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:18 AM
టాటా గ్రూప్‌లో పుట్టిన ముసలం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎన్ చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు చైర్మన్‌గా నియమించాలన్న టాటా సన్స్ బోర్డు నిర్ణయాన్ని అడ్డుకునేందుకు...
టాటా సన్స్ ప్రవర్తనా నియమావళికీ విరుద్ధం
మెజారిటీ వాటాదారుల మాటే నెగ్గాలి
కోర్టును ఆశ్రయించేందుకు టాటా ట్రస్ట్స్ సన్నాహాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో పుట్టిన ముసలం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎన్ చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు చైర్మన్‌గా నియమించాలన్న టాటా సన్స్ బోర్డు నిర్ణయాన్ని అడ్డుకునేందుకు నోయల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్‌లు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి టాటా సన్స్ బోర్డు ఈ నెల 17న 4-1 మెజారిటీతో చేసిన తీర్మానం చట్టపరంగా చెల్లదు గాక చెల్లదని టాటా ట్రస్ట్స్ మరోసారి స్పష్టం చేసింది. టాటా సన్స్ ఈక్విటీలో 66 శాతం వాటాకు ప్రాతినిధ్యం వహించే నోయల్ టాటాను కాదని.. చంద్రశేఖరన్‌ను చైర్మన్ పదవిలో మరో ఐదేళ్లు ఎలా నియమిస్తారని టాటా ట్రస్ట్స్ ప్రశ్నించింది.
చైర్మన్ నిర్ణాయక ఓటూ చెల్లదు: ఈ తీర్మానానికి అనుకూలంగా ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ హోదాలో నిర్ణాయక (కాస్టింగ్) ఓటు వేయడం కూడా చెల్లదని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది. తీర్మానానికి అనుకూలంగా, ప్రతికూలంగా చెరి సగం ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే చైర్మన్ తన నిర్ణాయక ఓటు ఉపయోగించాలి తప్ప, సాధారణ పరిస్థితుల్లో కాదని పేర్కొంది. టాటా సన్స్ సంస్థ ప్రవర్తనా నియమావళికి (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్) కూడా ఈ తీర్మానం విరుద్ధమని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 12న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన చంద్రశేఖరన్.. మరో ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగడం ఎలాంటి నైతికత అని ప్రశ్నించింది.
‘సుప్రీం’ తీర్పు స్పష్టం: టాటా ట్రస్ట్స్ ఈ సందర్భంగా సైరస్ మిస్త్రీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. టాటా సన్స్ చైర్మన్, ఇతర గ్రూప్ కంపెనీల చైర్మన్‌గా మిస్త్రీ తొలగింపు టాటా సన్స్ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానే జరిగిందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అదే ప్రవర్తనా నియమావళి ఇప్పుడు చంద్రశేఖరన్ పునర్నియామకం, టాటా సన్స్ షేర్ల లిస్టింగ్‌కూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. టాటా సన్స్ ఈక్విటీలో 66 శాతం వాటా ఉన్న తమ మాటే తుది మాట అవుతుంది తప్ప, మెజారిటీ బోర్డు సభ్యుల మాట కాదని టాటా ట్రస్ట్స్ తేల్చి చెప్పింది.
బాధగా ఉంది : సింఘ్వీ
ఈ కేసులో టాటా ట్రస్ట్స్ తరఫున వకాల్తా పుచ్చుకున్న ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ.. ఈ కేసులో వకాల్తా పుచ్చుకోవడం బాధగా, పశ్చాత్తాపం గా ఉందన్నారు. రెండు పక్షాలూ తనకు బాగా తెలుసన్నారు. అయినా కొన్ని సమస్యలకు సామరస్య పరిష్కారం దొరకనప్పుడు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదన్నారు. సైరస్ మిస్త్రీ కేసులో సుప్రీంకోర్టు.. టాటా సన్స్ నిర్వహణ ఆ సంస్థ ప్రవర్తనా నియమావళి ప్రకారమే జరగాలని స్పష్టం చేసిన విషయాన్ని సింఘ్వీ గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు