Share News

ఓపెన్‌ ఏఐతో టాటా జట్టు

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:27 AM

చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా గ్రూప్‌ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో గురువారం ప్రకటించింది. ఈ బహుళ సంవత్సరాల...

ఓపెన్‌ ఏఐతో టాటా జట్టు

భారత్‌లో 100 మెగావాట్ల ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి

న్యూఢిల్లీ: చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా గ్రూప్‌ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో గురువారం ప్రకటించింది. ఈ బహుళ సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తొలుత 100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. ఈ డేటా సెంటర్‌ సామర్థ్యాన్ని మున్ముందు ఒక గిగా వాట్‌కు పెంచుకునేలా ఏర్పాటు చేయనుంది. భవిష్యత్‌ తరం ఏఐ వర్క్‌లోడ్‌ను నిర్వహించగలగడంతో పాటు భారత్‌ను గ్లోబల్‌ ఏఐ హబ్‌గా నిలబెట్టడంలో ఈ కేంద్రం తన వంతు పాత్ర పోషించనుందని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌ మన్‌ తెలిపారు. అలాగే, ఈ రెండు సంస్థలు కలిసి దేశంలో ఎంటర్‌ప్రైస్‌ ఏఐ వినియోగాన్ని పెంచడంతోపాటు ఆయా రంగాలకు అవసరమైన ఏజెంటిక్‌ ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నాయి. భారత యువతకు ఏఐ టెక్నాలజీలో శిక్షణ అందించనున్నాయి.

ఏఐ చిప్‌ల తయారీలోకి టాటా

సాఫ్ట్‌వేర్‌ నుంచి డేటా సెంటర్ల వరకు విస్తరించిన టాటా గ్రూప్‌.. సెమీకండక్టర్ల తయారీలోకీ అడుగు పెట్టింది. ఏఐ టెక్నాలజీ సంబంధిత అన్ని విభాగాల అభివృద్ధిపై దృష్టిసారించిన తమ గ్రూప్‌.. ఆయా పరిశ్రమలకు అవసరమైన ఏఐ చిప్‌లను సైతం తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. తొలుత వాహన రంగం కోసం వీటిని తయారు చేయనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. వ్యవస్థపై ఏఐ భారీ ప్రభావం చూపనుందన్నారు. అందుకే అన్ని విభాగాల్లోనూ ఏఐని వినియోగించుకుంటున్నామని అన్నారు.


ఏఐ సదస్సులో పాల్గొన్న పలువురు ఇండస్ట్రీ ప్రతినిధులు ఏమన్నారంటే..

దిగుమతులపై ఆధారపడే బదులు భారత్‌ సొంత ఏఐ మౌలిక వసతులను నిర్మించుకోవాలి. ఏఐ జాతీయ సార్వభౌమాధికారాన్ని పునర్‌నిర్వచించనుంది. కాబట్టి, భారత్‌ తన ఏఐ భవిష్యత్‌ను సంరక్షించుకునేందుకు ఇంధనం, కంప్యూటింగ్‌, క్లౌడ్‌ మరియు సేవల్లోనూ సార్వభౌమత్వాన్ని పొందాలి.

జీత్‌ అదానీ, అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

ఏఐ అప్లికేషన్స్‌కు ప్రపంచంలో అత్యంత అనుకూల దేశంగా మారే అవకాశం భారత్‌కు ఉంది. కానీ, ఏఐని ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలనే ఎంపికలతోపాటు బాధ్యతాయుత వినియోగంపై దేశానికి కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.

రిషద్‌ ప్రేమ్‌జీ, విప్రో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌

దక్షిణ ప్రపంచంలో తొలి ఏఐ సదస్సు నిర్వహణ ద్వారా ఏఐ ప్రపంచంలో భారత్‌ చాలా బలమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. భారత్‌ సహా 14 ఆఫ్రికా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్‌టెల్‌ డేటా సెంటర్లు, కనెక్టివిటీ పెంపు ఆలోచనలో ఉంది. వచ్చే 3-4 ఏళ్లలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 120 మెగావాట్ల నుంచి 1 గిగావాట్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సునీల్‌ మిట్టల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌

భారత టెక్నాలజీ రంగం సేవల వ్యాప్తి ఆధారిత వృద్ధి నుంచి ఏఐ కేంద్రీకృత, మేధస్సు నేతృత్వ, మేధో సంపత్తి(ఐపీ) ఆధారిత నమూనాకు మారాలి. కేవలం సాంకేతికతను అందజేయడం కాకుండా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌, మోడల్స్‌, ప్రొడక్ట్స్‌ అభివృద్ధి చేసే కంపెనీలదే భవిష్యత్‌.

రోష్నీ నాడార్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్‌పర్సన్‌

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 03:27 AM