ఆటుపోట్ల మార్కెట్లో మదుపరుల వ్యూహం ఎలా?
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:51 AM
పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఫ్రంట్‌లైన్ స్టాక్స్‌తో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లూ ‘బేర్’మంటున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపరుల పెట్టుబడుల వ్యూహం...
పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఫ్రంట్‌లైన్ స్టాక్స్‌తో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లూ ‘బేర్’మంటున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపరుల పెట్టుబడుల వ్యూహం ఎలా ఉండాలో తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ దేశీయ స్టాక్ మార్కెట్‌ది ఇదే పరిస్థితి. మధ్యలో కొద్దిపాటి రిలీఫ్ ర్యాలీ వచ్చినా అది పెద్దగా నిలదొక్కుకోలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్ రూ.468 లక్షల కోట్ల నుంచి రూ.422 లక్షల కోట్లకు (9.83 శాతం) పడిపోయింది. ఇదే సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 12.72 నుంచి 13.62 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 22.64 శాతం వరకు నష్టపోవడం గమనార్హం.
ఏం చేయాలి..
స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న ఆటుపోట్లు చూసి రిటైల్ మదుపరులు బెంబేలెత్తి పోతున్నారు. పశ్చిమాసియా యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. దీంతో సూచీలు ఇంకా ఎంత పడిపోతాయోననే భయంతో రిటైల్ మదుపరుల్లో కొందరు నష్టాలకు సైతం సిద్ధపడి తమ దగ్గర ఉన్న మంచి కంపెనీల షేర్లు, మ్యూచువల్ ఫండ్ పథకాల యూనిట్లను కూడా అమ్మేస్తున్నారు. ఇది ఏ మాత్రం తెలివైన పనికాదు. మరేమీ చేయాలంటే..
‘సిప్’లు ఆపొద్దు
చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇటీవల క్రమానుగత పెట్టుబడి (సిప్) పద్దతిలో మంచి కంపెనీల షేర్లు లేదా చక్కటి పనితీరు కనబరుస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల యూనిట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్లను చూసి, కొంతమంది ఈ సిప్ పెట్టుబడులకు బ్రేక్ ఇస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదు. మార్కెట్ ఆటుపోట్లను సైతం తట్టుకుని చక్కటి రాబడులు అందించడమే సిప్ పెట్టుబడుల లక్ష్యం. సూచీలు పడినప్పుడల్లా సిప్ పద్దతిలో చేసే పెట్టుబడులతో మరిన్ని షేర్లు లేదా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ‘అందరూ అమ్మేటప్పుడు కొనుక్కోవాలి, అందురూ కొనేటప్పుడు అమ్ముకోవాలి’ అనేది స్టాక్ మార్కెట్లో ప్రాథమిక సూత్రం. మంచి కంపెనీల షేర్ల విషయంలో ఇది మరింత నిజం. కాబట్టి ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్లకు భయపడి ‘సిప్’ పెట్టుబడులకు బ్రేక్ ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదు.
పెట్టుబడుల ప్లాన్ మార్చొద్దు..
మార్కెట్లో ఆటుపోట్లు తీవ్రంగా ఉన్నప్పుడు చాలా మంది ఒక కంపెనీ షేర్ల నుంచి ఇంకో కంపెనీ షేర్లలోకి లేదా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి మరో ఫండ్ పథకాల్లో మారాలని టెంప్ట్ అవుతుంటారు. ఇంకొందరు ఈక్విటీ పెట్టుబడులు తగ్గించుకుని సురక్షితమైన బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)లోకి మారుతుంటారు. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలూ దెబ్బతింటాయి. మీ పెట్టుడుల వ్యూహాలు కష్ట సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్దేశించినవనే విషయం మర్చిపోవద్దు.
పెట్టుబడులు పెంచండి
నిజానికి పడిపోతున్న మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఒక చక్కటి అవకాశం. ఏ మాత్రం మిగులు నిధులు ఉన్నా మార్కెట్ ప్రస్తుత పతనం పెట్టుబడులకు చక్కటి అవకాశం. కాకపోతే ఏ కంపెనీ షేర్లు పడితే ఆ కంపెనీ షేర్లు కొనకుండా మంచి ఫండమెంటల్స్‌తో ఆకర్షణీయ ధరల్లో దొరుకుతున్న కంపెనీల షేర్లను మాత్రమే ఎంచుకోవాలి. లేకపోతే నష్టాలు తప్పవు. ఈ కొనుగోళ్లు కూడా ఒకేసారి కాకుండా, నిర్ధిష్ట ప్రైస్ బ్యాండ్ పెట్టుకుని రెండు మూడు విడతలుగా కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుతం అనేక బ్లూచిప్ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. పరిస్థితులు కుదుటపడితే ముందుగా ర్యాలీ వచ్చే బ్లూచిప్ షేర్లలోనే అనే విషయం మర్చిపోవద్దు.
పెట్టుబడులపై సమీక్ష
పెట్టుబడుల సమీక్షకు కూడా ఇది సరైన సమయం. మార్కెట్ కరెక్షన్‌తో చాలా మంది దీర్ఘకాలిక మదుపరుల పెట్టుబడుల్లో ఈక్విటీ పెట్టుబడుల వాటా తగ్గింది. ఏ మాత్రం మిగులు నిధులు ఉన్నా ఆ మొత్తాన్ని ఈక్విటీ వాటా పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం అనేక బ్లూచిప్ కంపెనీల షేర్లు, వాటి దీర్ఘకాలిక వాల్యుయేషన్స్ కంటే తక్కువ ధరలో లభిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు.
ఆటుపోట్లు పట్టించుకోవద్దు
మార్కెట్లో ఏదీ శాశ్వతం కాదు. ఆటుపోట్లు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రస్తుతం మార్కెట్‌ను చమురు ధర, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ స్వల్పకాలిక పరిణామాలే. పశ్చిమాసియా సంక్షోభం ఏ మాత్రం చల్లారినా మార్కెట్లు వెంటనే పుంజుకుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘సిప్’ పెట్టుబడులు ఆపొద్దు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలకు ఇది ఏమాత్రం మంచిది కాదు.
చరిత్ర చెప్పే నిజాలు
సాధారణంగా ఏదైనా తీవ్రమైన ఆటుపోట్లు ఏర్పడినప్పుడు మార్కెట్లు 10 నుంచి 20 శాతం వరకు నష్టపోతుంటాయి. 2008 ఆర్థిక సంక్షోభం, 2020 నాటి కొవిడ్ సమయాల్లో అయితే సూచీలు సగానికి పడిపోయాయి. అప్పట్లో ధైర్యం చేసి మంచి కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఎవరూ నష్టపోలేదు. ఆ సంక్షోభాలు ముగిసిన ఏడాదిలోపే మంచి లాభాలు కళ్లజూశారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులను క్రికెట్ టెస్టు మ్యాచ్‌గా చూడాలే తప్ప టీ20 మ్యాచ్‌లా చూడకూడదు.
ఓపికే కీలకం
దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలంటే ధైర్యం ఒక్కటే చాలదు. ఓపిక, క్రమశిక్షణ ముఖ్యం. ప్రస్తుత ఆటుపోట్లను కూడా ఒక అవకాశంగా మలుచుకోవచ్చు.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు