Share News

చమురు చల్లారె.. బుల్‌ చిందేసె..

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:19 AM

చాలా రోజుల తర్వాత దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ ఆనందంతో చిందులు తొక్కింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ముడి చమురు ధరలు...

చమురు చల్లారె.. బుల్‌ చిందేసె..

ఇరాన్‌తో యుద్ధం ముగిసిందన్న

ట్రంప్‌ ప్రకటనతో 90 డాలర్ల దిగువకు క్రూడ్‌

  • కొనుగోళ్ల జోష్‌తో సెన్సెక్స్‌ 1,695 పాయింట్లు అప్‌

  • 461 పాయింట్ల లాభంతో 23,623 వద్దకు నిఫ్టీ

  • రూ.10 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్‌ సంపద

ముంబై: చాలా రోజుల తర్వాత దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ ఆనందంతో చిందులు తొక్కింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ముడి చమురు ధరలు 90 డాలర్ల దిగువకు జారుకోవడంతో పాటు ప్రపంచ మార్కెట్లు ర్యాలీ తీయడం ఇందుకు కారణం. మన మార్కెట్లోనూ మదుపరులు కొనుగోళ్లు హోరెత్తించడంతో సెన్సెక్స్‌ ఒక దశలో 1,775.47 పాయింట్లు ఎగబాకి 75,608 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 1,695.40 పాయింట్ల (2.30 శాతం) లాభంతో 75,527.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 461.30 పాయింట్ల (1.99 శాతం) వృద్ధితో 23,622.90 వద్దకు చేరుకుంది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఏకంగా రూ.9.67 లక్షల కోట్లు పెరిగి రూ.462 లక్షల కోట్లకు (4.84 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 27 లాభాల్లో ముగిశాయి.

రూపీ 67 పైసలు జంప్‌ : మన కరెన్సీ కూడా భారీగా పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు పెరిగి రూ.95.18 వద్ద ముగిసింది.

క్రూడ్‌ 4 శాతం డౌన్‌: ఇరాన్‌పై మిలటరీ దాడులు ముగిసాయని ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 4.25 శాతం తగ్గి మూడు నెలల కనిష్ఠ స్థాయి 86.54 డాలర్లకు జారుకుంది.

కాసాగ్రాండ్‌ రూ.1,220 కోట్ల ఐపీఓ: హైదరాబాద్‌లో పలు గృహ ప్రాజెక్టులను నిర్మిస్తున్న చెన్నైకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కాసాగ్రాండ్‌ ప్రీమియర్‌ బిల్డర్‌ రూ.1,220 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు సెబీ ఆమోదం లభించింది. కంపెనీ గత ఏడాది డిసెంబరులో సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించింది.


గోల్డ్‌ రూ.3,000.. సిల్వర్‌ రూ.10,000 అప్‌

వరుసగా రెండు రోజులు భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు రూ.3,000 పెరుగుదలతో రూ.1,56,900కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.10,000 ఎగబాకి రూ.2,55,700 ధర పలికింది. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న ఆశలతో అంతర్జాతీయ విపణిలో విలువైన లోహాలకు మళ్లీ డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమైంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 4,200 డాలర్ల ఎగువకు చేరగా.. సిల్వర్‌ 67 డాలర్ల పైన ట్రేడైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 05:19 AM