కొత్త ఆర్థిక సంవత్సరానికి శుభారంభం
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:09 AM
కొత్త ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ మార్కెట్ శుభారంభం ఇచ్చింది. రెండు రోజుల వరుస భారీ పతనాలకు తెర దించింది. రిలీఫ్ ర్యాలీతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది...
సెన్సెక్స్ 1,186 పాయింట్లు జంప్
మార్కెట్ క్యాప్ రూ..9.60 లక్షల కోట్లు అప్
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ మార్కెట్ శుభారంభం ఇచ్చింది. రెండు రోజుల వరుస భారీ పతనాలకు తెర దించింది. రిలీఫ్ ర్యాలీతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. సెన్సెక్స్ 1,186.77 పాయింట్ల లాభంతో 73,134.32 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభపడి 73,964.58 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద ముగిశాయి. ఈ ర్యాలీతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (ఇన్వెస్టర్ల సంపద) బుధవారం రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ.422 లక్షల కోట్లకు చేరింది. పశ్చిమాసియా యుద్ధానికి త్వరలో తెర పడుతుందనే సంకేతాలు, బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల దిగువకు రావడం, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లో ర్యాలీకి దోహదపడ్డాయి. ప్రస్తుత సానుకూల వాతావరణంలో గురువారంనాడు కూడా ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
ఐపీఓలకు కంపెనీల ఉత్సాహం: సెకండరీ మార్కెట్ గత కొద్ది రోజులుగా భారీ ఆటుపోట్లకు లోనవుతున్నా ఐపీఓల జారీకి కంపెనీలు ఉత్సాహపడుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజుల కాలంలోనే రెండు డజన్లకు పైగా కంపెనీలు ఐపీఓ జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేయడమే ఇందుకు నిదర్శనం.
మళ్లీ బులియన్ మెరుపులు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలమైన సంకేతాలతో బులియన్ మార్కెట్ బుధవారం కళకళలాడింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.9,000 పెరిగి రూ.2.46 లక్షలు పలికింది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 76.51 డాలర్లు పెరిగి 4743.89 డాలర్లకు చేరింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గి 75.04 డాలర్లుగా నమోదయింది.
50 వసంతాల యాపిల్
కాలిఫోర్నియా: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వాజ్నిక్, రోనాల్డ్ వేన్ కలిసి కాలిఫోర్నియాలోని ఓ కారు గ్యారేజీలో 1976 ఏప్రిల్ 1న తమ స్టార్టప్ ప్రస్థానాన్ని ఆరంభించారు. అలా పుట్టుకొచ్చిందే యాపిల్ కంప్యూటర్ కంపెనీ. తొలుత కంప్యూటర్ల తయారీకే పరిమితమైన ఈ కంపెనీ.. గడిచిన రెండున్నర దశాబ్దాల్లో ఐపోడ్, ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌ల తయారీతో తన ప్రజాదరణను విశ్వవ్యాప్తం చేసుకోగలిగింది. గడిచిన 5 దశాబ్దాల్లో కంపెనీ 3.6 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.
బంగారం, వెండి ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: బంగారం, ప్లాటినం, వెండి ఆభరణాల దిగుమతులపై తక్షణమే అమలులోకి వచ్చేలా ఆంక్షలు విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వీటి దిగుమతులకు సంబంధించి వర్తకుల మధ్య ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, రద్దు చేయలేని రుణపత్రం, ముందస్తు చెల్లింపులు, సరుకు రవాణా స్థితి లేదా మరే ఇతర అంశాలతో సంబంధం లేకుండా ఈ ఆంక్షలు తక్షణమే వర్తిస్తాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎ్‌ఫటీ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇకపై వీటి దిగుమతిదారులు డీజీఎ్‌ఫటీ నుంచి అనుమతి లేదా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, 100 శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు, సెజ్‌లలోని యూనిట్లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News