Share News

మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:14 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా..

మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

సెన్సెక్స్‌ 715 పాయింట్లు పతనం

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధర ఏకంగా 95 డాలర్లకు ఎగబాకడంతో పాటు బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు కొనసాగడం ఇందుకు కారణమయ్యాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 829 పాయింట్లు పతనమైనప్పటికీ, చివరికి 715.06 పాయింట్ల నష్టంతో 76,755.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 191.45 పాయింట్లు క్షీణించి 23,996.25 వద్ద ముగిసింది. గడిచిన రెండు వారాల్లో సూచీలకిదే అతిపెద్ద నష్టం. దాంతో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4.24 లక్షల కోట్లు తగ్గి రూ.480.05 లక్షల కోట్లకు (4.98 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఇకపోతే, క్రూడ్‌ ధరలు భగ్గుమనడంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు తగ్గి రూ.96.53 వద్ద ముగిసింది.

ఫార్మా షేర్లకు ట్రం‘పోటు’: అమెరికాలోకి దిగుమతయ్యే జెనరిక్‌ ఔషధాలపై సుంకాన్ని దశల వారీగా 200 శాతానికి పెంచనున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో భారత ఫార్మా కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎ్‌సఈలో లూపిన్‌ స్టాక్‌ 4.21 శాతం నష్టపోగా.. అరబిందో ఫార్మా 1.99 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.95 శాతం, గ్లెన్‌మార్క్‌ ఫార్మా 1.49 శాతం, ఆల్కెమ్‌ ల్యాబ్‌ 1.43 శాతం, సిప్లా 1.08 శాతం, సన్‌ఫార్మా 0.98 శాతం, బయోకాన్‌ 0.57 శాతం క్షీణించాయి.

ఇవి కూడా చదవండి..

2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..

పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 23 , 2026 | 03:14 AM