రెండో రోజూ నష్టాలే..
ABN , Publish Date - May 28 , 2026 | 02:45 AM
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో...
సెన్సెక్స్ 142 పాయింట్లు డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 476 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్.. చివరికి 141.90 పాయింట్ల నష్టంతో 75,867.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 6.55 పాయింట్ల నష్టంతో 23,907.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 10 నష్టపోయాయి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.29 శాతం నష్టపోగా.. మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ మాత్రం 0.52 శాతం లాభపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగి రూ.95.58 వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ను వెనక్కి నెట్టిన అదానీ పవర్
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పవర్ మరో ఘనత సాధించింది. మన మార్కెట్లో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల జాబితాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసి్‌సను వెనక్కి నెట్టి 11వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది కాలంలో అదానీ పవర్ షేరు 74 శాతం మేర పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. బీఎ్‌సఈలో బుధవారం ట్రేడింగ్ ముగిసే సరికి అదానీ పవర్ షేరు ధర 1.72 శాతం లాభంతో రూ.248.75 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.4.79 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో ఇన్ఫోసిస్ షేరు 0.7 శాతం నష్టంతో రూ.1,159.15 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.70 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇన్ఫీ షేరు ధర దాదాపు 29 శాతం మేర క్షీణించింది.
నేడు మార్కెట్లకు సెలవు
బక్రీద్ సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లు, ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. శుక్రవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి.