సరుకు వెనక్కు పంపుతుంటే..
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:24 AM
ఒక వ్యాపారి తాను కొనుగోలు చేసిన సరుకును సరఫరాదారునికి వెనక్కు పంపటం అనేది వ్యాపార లావాదేవీల్లో సర్వ సాధారణం. ఇది ఒక వ్యాపారి నుంచి డిస్ట్రిబ్యూటర్‌కు కావచ్చు లేదా ఒక వ్యాపారి లేదా...
ఒక వ్యాపారి తాను కొనుగోలు చేసిన సరుకును సరఫరాదారునికి వెనక్కు పంపటం అనేది వ్యాపార లావాదేవీల్లో సర్వ సాధారణం. ఇది ఒక వ్యాపారి నుంచి డిస్ట్రిబ్యూటర్‌కు కావచ్చు లేదా ఒక వ్యాపారి లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉత్పత్తిదారులకు కావచ్చు. ఈ విధంగా సరుకు వెనక్కు పంపటానికి వివిధ కారణాలు ఉండొచ్చు. వచ్చిన సరుకులో నాణ్యతాపరమైన లోపాలు ఉండటం ఒక కారణమైతే, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తిదారులు కొత్త ప్రొడక్ట్ తయారు చేసిన ప్రతిసారి ఆయా ప్రొడక్ట్స్‌ను డిస్ట్రిబ్యూటర్లకు పంపుతుంటారు. ఆయా వస్తువులు అమ్ముడుపోకపోతే తిరిగి వెనక్కి పంపవచ్చు అనే షరతు మీద. అలాగే సీజన్ ప్రకారం వ్యాపారం జరిగే ఎరువులు, పురుగు మందుల వ్యాపారంలో కూడా సీజన్ ముగిసే నాటికి మిగిలిన సరుకును వెనక్కు పంపిస్తుంటారు. ఇలా సరుకు వెనక్కు పంపటం అనేది ఆయా సరఫరాదారులు, కొనుగోలుదారుల మధ్య ఉన్న ఒప్పందాన్ని బట్టి జరుగుతుంది.
నియయ నిబంధనలున్నాయ్..
అయితే ఇలా సరుకు వెనక్కు పంపేటప్పుడు జీఎ్‌సటీకి సంబంధించి సరఫరాదారులు, కొనుగోలుదారులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఉన్నాయి. కొనుగోలు చేసిన సరుకును వెనక్కు పంపటానికి రెండు రకాల పద్దతులు ఉన్నాయి. మొదటిది.. సరఫరాదారుడు, కొనుగోలుదారునికి వెనక్కు పంపే సరుకు విలువ, దానికి సంబంధించిన జీఎ్‌సటీతో ఒక క్రెడిట్ నోట్ జారీ చేస్తాడు. ఇప్పుడు కొనుగోలుదారుడు ఆ క్రెడిట్ నోట్ ఆధారంగా డెలివరీ చలాన్ మీద సరుకును వెనక్కు పంపాలి. ఇలా పంపేటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించనక్కరలేదు. కానీ, వెనక్కు పంపే సరుకుకు సంబంధించి ఇంతకు ముందు తీసుకున్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రివర్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే నిబంధనల మేరకు పంపే సరుకుకు ఈవే బిల్లు ఉండాలి.
అయుతే సరఫరాదారుడు క్రెడిట్ నోట్‌ను జారీ చేయటానికి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఎందుకంటే క్రెడిట్ నోట్‌లో మొదట సరుకును ఏ ఇన్వాయి్‌సలో పంపారో ఆ ఇన్వాయిస్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఇలా ఇన్వాయిస్ తో మ్యాచ్ చేయటం కుదరకపోవచ్చు. అలాగే సరఫరాదారుడు తాను జారీ చేసిన క్రెడిట్ నోట్ విలువను తగ్గించుకోవటానికి కాలపరిమితి ఉంటుంది. ఆ సమయం దాటితే విలువను తగ్గించుకోవటం కుదరదు. కాబట్టి క్రెడిట్ నోట్‌ను జారీ చేసినా దానికి సంబంధించిన ప్రయోజనం పొందలేడు. అలాగే కొనుగోలుదారుడికి కూడా ఎంత రివర్స్ చేయాలో ఒక్కొక్కసారి అర్ధం కాదు.
ఇలాంటప్పుడు రెండో పద్దతి పాటించవచ్చు. ఇందులో వెనక్కు పంపే సరుకును కొత్త సరఫరా కింద భావించాలి. అంటే వ్యాపారి తాను వెనక్కు పంపే సరుకును అమ్మకం కింద చూపుతూ దానికి ఒక ఇన్వాయిస్ జారీ చేయటంతో పాటుగా దానికి సంబంధించిన పన్ను చెల్లించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే.. సరుకు అమ్మేటప్పుడు ఎలాంటి నిబంధనలు ఉంటాయో అవన్నీ పాటించాలి. అంటే క్రెడిట్ రివర్స్ చేసే బదులు కొత్తగా పన్ను కడుతున్నాడన్న మాట. అలాగే ఆ సరుకును వెనక్కు పొందిన తర్వాత సదరు డిస్ట్రిబ్యూటర్ లేదా ఉత్పత్తిదారుడు దాన్ని కొనుగోలుగా భావించి ఆ ఇన్వాయిస్ మీద ఉన్న పన్ను మొత్తాన్ని ఇన్‌పుట్ కింద తీసుకోవచ్చు. అంటే ఈ రెండో పద్దతిలో సరుకు వెనక్కు పంపే వ్యక్తి అమ్మకందారుడిగా, సరుకును వెనక్కు పొందే వ్యక్తి అంటే సరుకు మొదట పంపిన సరఫరాదారుడు.. కొనుగోలుదారుడిగా వ్యవహరిస్తారు.
కానీ చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే సరఫరాదారుడు క్రెడిట్ నోట్‌ను జారీ చేయటం, అలాగే కొనుగోలుదారుడు ఇన్వాయిస్ ఇవ్వటం రెండు కలిపి చేస్తుంటారు. ఇలా రెండు పద్దతులు కలపటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు పద్దతుల్లో ఏదో ఒక పద్దతి పాటిస్తే సరఫరాదారుడికి, కొనుగోలుదారుడికి సులువుగా ఉంటుంది. ఇంకా కొంత మంది భావించేది ఏమిటంటే సరఫరాదారుడు క్రెడిట్ నోట్ ఇచ్చే బదులు కొనుగోలుదారుడు డెబిట్ నోట్ ఇవ్వొచ్చు కదా అని. కానీ. జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం క్రెడిట్ నోట్ అయినా, డెబిట్ నోట్ అయినా సరఫరాదారుడే ఇవ్వాలి తప్ప కొనుగోలుదారుడు ఇవ్వకూడదు.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్