Share News

మార్కెట్లకు ‘క్రూడ్‌’ షాక్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:04 AM

ముడి చమురు ధర సెగలు కక్కుతోంది. ఆదివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10 గంటల ప్రాంతంలో బ్రెంట్‌ రకం ముడి చమురు బ్యారెల్‌ ధర 103 డాలర్లు, వెస్ట్‌ టెక్సాస్‌ ముడి చమురు 99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి...

మార్కెట్లకు ‘క్రూడ్‌’ షాక్‌

నాలుగేళ్ల గరిష్ఠం 103 డాలర్లకు బ్యారెల్‌ ధర

  • త్వరలో 150 డాలర్లకు చేరుతుందనే భయాలు

  • డాలర్‌తో బక్కచిక్కుతున్న రూపాయి

ముడి చమురు ధర సెగలు కక్కుతోంది. ఆదివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10 గంటల ప్రాంతంలో బ్రెంట్‌ రకం ముడి చమురు బ్యారెల్‌ ధర 103 డాలర్లు, వెస్ట్‌ టెక్సాస్‌ ముడి చమురు 99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత నాలుగేళ్లలో ముడి చమురు ధర ఇంత భారీ స్థాయిలో ట్రేడవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్‌ హార్ముజ్‌ జల సంధిని మూసివేయడం ఇందుకు ప్రధాన కారణం.

150 డాలర్లకు !: పరిస్థితులు ఎక్కువ రోజులు ఇలానే కొనసాగితే బ్యారెల్‌ ముడి చమురు ధర త్వరలోనే 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. నిజానికి ఈ యుద్ధం ప్రారంభంలోనే బ్యారెల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్లకు చేరింది. అయితే అమెరికా, ఇతర దేశాలు తమ అత్యవసర చమురు నిల్వల నుంచి పెద్ద మొత్తంలో చమురును విడుదల చేయడంతో ధరలు కొద్దిగా దిగి వచ్చాయి. ఇప్పట్లో ఈ యుద్ధానికి ముగింపు కనిపించని వాతావరణంలో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. ఇది త్వరలోనే 110 నుంచి 125 డాలర్లకు, ఆ తర్వాత 145-150 డాలర్లకు చేరే అవకాశం లేకపోలేదని కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ అనింద్య బెనర్జీ తెలిపారు. ఇదే జరిగితే భారత, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణుల అంచనా.

స్టాక్‌ మార్కెట్‌ ‘బేర్‌’: గల్ఫ్‌ యుద్ధంతో భారత స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికే తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. గత రెండు వారాల్లో నిఫ్టీ ఎనిమిది శాతం నష్టపోయింది. దీంతో దాదాపు రూ.30 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఈ ఆటుపోట్లకు భయపడి ఎఫ్‌పీఐలు కూడా పెద్ద ఎత్తున అమ్మకాలకు తెర తీశాయి. గత రెండు వారాల్లోనే ఈ సంస్థలు భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.52,704 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు సెగ ఇలానే కొనసాగితే ఎఫ్‌పీఐలు మరింత పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగే అవకాశం ఉందని ఏంజల్‌ వన్‌ బ్రోకరేజి సంస్థ సీనియర్‌ ఫండమెంటల్‌ అనలిస్ట్‌ వకార్‌ జావేద్‌ ఖాన్‌ చెప్పారు. సూచీలు మరో 10ు వరకు నష్టపోయే ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.


ఆర్థికానికి ముప్పు: ముడి చమురు కొండెక్కడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇక్కట్లలో పడవచ్చు. ధరల సెగ ద్రవ్యోల్బణాన్ని మళ్లీ ఎక్కడ పోటెత్తిస్తుందో అని ఆర్‌బీఐ భయపడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజు రోజుకీ క్షీణిస్తోంది. ఇప్పటికే ఇది రూ.92కి చేరింది. పరిస్థితి ఇలానే కొనసాగితే రూపాయి మారకం రేటు రూ.93-94కు కూడా చేరే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. చమురు సెగతో ద్రవ్య, వాణిజ్య, మూల ధన ఖాతా (సీఏడీ) లోటు కూడా అదుపు తప్పే ప్రమాదం కనిపిస్తోంది.

బులియన్‌ దారి ఎటు?: అంతర్జాతీయ ఉద్రిక్తతలు ముదిరినపుడు బంగారం, వెండి ధరలు కొండెక్కడం సహ జం. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. చము రు సెగ, అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై అధిక వడ్డీరేటు ఇందుకు ప్రధాన కారణం. అయితే డాలర్‌తో రూపా యి మారకం రేటు రికార్డు స్థాయికి చేరడంతో ఈ వారం భారత మార్కెట్‌లో పసిడి, వెండి ధర కొద్దిగా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.

‘ఓఎంసీ’ల తర్జన భర్జన: ముడి చమురు ధర సెగ ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలనీ భయపెడుతోంది. దీంతో ఈ కంపెనీలు ఎంఆర్‌పీఎల్‌, సీపీసీఎల్‌, నయారా, రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన రిఫైనీలకు చెల్లిం చే ధరలను తగ్గించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీలు పెద్ద మొత్దంలో చమురు దిగుమతి చేసుకుని దాన్ని పెట్రోల్‌, డీజిల్‌గా మార్చి ఓఎంసీల ద్వారా మార్కెట్‌ చేస్తున్నాయి. ఈ కంపెనీలకు సొంత పెట్రో ల్‌ బంకులు పెద్దగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుత చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ఇష్టపడడం లేదు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై వస్తున్న నష్టాల్లో కొంతై నా ఈ ప్రైవేటు రిఫైనరీలకు బదిలీ చేయాలని ఓఎంసీలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఈ రెండు ఉత్పత్తులపై వాటికి చెల్లించే ధరలో కోత పెట్టడం లేదా డిస్కౌంట్‌ మొత్తాన్ని నిర్ణీత శాతానికి కుదించడంగానీ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లేకపోతే ఈ కంపెనీల పెట్రోల్‌, డిజిల్‌ అమ్మకాలపై వచ్చే నష్టం మొత్తాన్ని తాము ఒక్కరమే భరించడం అయ్యేపని కాదని భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 01:05 AM