బైబ్యాక్‌లో మూలధన లాభాలపై 12 శాతం సర్‌చార్జి
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:44 AM
కంపెనీల బై బ్యాక్ (సొంత షేర్ల తిరిగి కొనుగోలు) ఆఫర్‌లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై వ్యక్తులు, కార్పొరేట్ వాటాదారులు అనే తేడా లేకుండా ఇకపై అందరూ ఏకరీతిగా 12 శాతం సర్‌చార్జి...
ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు; అందరికీ వర్తింపు
ఫైనాన్స్ బిల్లులో సవరణలకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: కంపెనీల బై బ్యాక్ (సొంత షేర్ల తిరిగి కొనుగోలు) ఆఫర్‌లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై వ్యక్తులు, కార్పొరేట్ వాటాదారులు అనే తేడా లేకుండా ఇకపై అందరూ ఏకరీతిగా 12 శాతం సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అందరికీ ఒకే రకమైన సర్‌చార్జి సహా 32 సవరణలతో కూడిన ఫైనాన్స్ బిల్లు 2026కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభకు పంపనున్నారు. ప్రస్తుతం రూ.50 లక్షల వరకు పన్ను ఆదాయం కలిగిన వ్యక్తులకు ఎలాంటి సర్‌చార్జి లేదు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పన్ను ఆదాయ శ్రేణిలోని వారికి బైబ్యాక్ ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై సర్‌చార్జి 10ు ఉంది. తాజా సవరణతో ఈ రెండు ఆదాయ శ్రేణి వర్గాలపై పన్ను భారం పెరగనుందని నాంగియా గ్లోబల్ అడ్వైజర్స్ భాగస్వామి సందీప్ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. వ్యక్తిగత షేర్‌హోల్డర్లు ఇకపై బైబ్యాక్‌లో పాల్గొనడాన్ని ఇది నిరుత్సాహపరచనుందన్నారు. చిన్న, మధ్య స్థాయి బైబ్యాక్‌లపై ఇది అధిక ప్రభావం చూపవచ్చునన్నారు. రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన వారికి మాత్రం లబ్ది చేకూరనుంది. ఎందుకంటే, ఈ విభాగంలోకి వచ్చేవారికి ప్రస్తుతం సర్‌చార్జి 15ు ఉండగా.. ఏప్రిల్ 1 నుంచి 12 శాతానికి తగ్గనుంది. కార్పొరేట్ షేర్‌హోల్డర్లకు ప్రస్తుతం రూ.కోటి వరకు పన్ను ఆదాయంపై ఎలాంటి సర్‌చార్జి లేదు. రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయం లభించే వారికి సర్‌చార్జి 7 శాతంగా ఉంది. వచ్చేనెల నుంచి వీరు కూడా 12 శాతం సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అనగా, వీరిపైనా పన్ను భారం పెరగనుంది.
బైబ్యాక్‌పై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లోనూ మార్పులు
కంపెనీల బైబ్యాక్ ఆఫర్లలో మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను రక్షించడంతోపాటు ప్రమోటర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో సమూల మార్పులు ప్రకటించారు. ఇకపై ప్రమోటర్ల పరిధిలోకి రాని అన్ని విభాగాల షేర్‌హోల్డర్ల బైబ్యాక్ రాబడులపై క్యాపిటల్ గెయిన్ పన్ను వసూలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ 12.5 శాతంగా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20 శాతంగా ఉంది. బైబ్యాక్‌లో తమ వాటా విక్రయించే ప్రమోటర్లు మాత్రం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని సీతారామన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ ప్రమోటర్లపై పన్ను రేటు 22 శాతంగా, నాన్ - కార్పొరేట్ ప్రమోటర్లపైౖ పన్ను రేటు 30 శాతంగా ఉండనుంది. కంపెనీ ప్రమోటర్లు తమ ఈక్విటీ వాటాల రాబడులపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు బైబ్యాక్‌లను ఉపయోగించుకోకుండా నివారించడమే ఈ మార్పు ల ఉద్దేశం. అలాగే, బైబ్యాక్‌లో షేర్లను విక్రయించే చిన్న, సాధారణ షేర్‌హోల్డర్లకు మాత్రం లబ్ధి చేకూరనుంది. ఎందుకంటే, ప్రస్తుతం బైబ్యాక్ రాబడులను డివిడెండ్‌గా పరిగణించి కేంద్రం 35ు వరకు పన్ను విధిస్తోంది తాజా మార్పుతో వీరికి బైబ్యాక్ రాబడులపై పన్ను భారం దీర్ఘకాలిక (కనీసం మూడేళ్లు) పెట్టుబడిపై 12.5 శాతానికి, స్వల్పకాలిక (1-3 సంవత్సరాలు) పెట్టుబడిపై 20 శాతానికి తగ్గనుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్