నిబంధనలకు స్టార్‌లింక్ కట్టుబడి ఉండాల్సిందే: భారత వర్గాలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:21 AM
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి కొన్ని నిబంధనలకు స్టార్‌లింక్ అంగీకరించనందునే ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి కొన్ని నిబంధనలకు స్టార్‌లింక్ అంగీకరించనందునే ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సేవలకు సంబంధించిన మౌలికవసతులను భారత్‌లోనే ఏర్పాటు చేయాలని అన్నారు. భారత్‌లో వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడి నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని పరోక్షంగా హెచ్చరించారు. స్థానికంగా స్టార్‌లింక్ బేస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు భద్రతాపరమైన ఇతర చర్యలు తీసుకుంటే శాటిలైట్ సేవల ప్రారంభానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. బేస్ స్టేషన్ల ద్వారానే యూజర్లు వైర్లెస్ నెట్‌వర్క్‌కు అనుసంధానం అవుతారు.
శాటిలైట్ ఇంటర్నెట్ సేవల అనుమతుల కోసం ఎయిర్‌టెల్‌కు చెందిన యూటెల్‌శాట్ వన్ వెబ్ సర్వీసెస్, రిలయన్స్ జియో కూడా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ సునీల్ భారతీ మిట్టల్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితమే తాము అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నామని, ఈ ప్రక్రియలో ముందువరుసలో ఉన్నామని అన్నారు.
స్టార్‌లింక్‌కు అనుమతుల్లో జాప్యంపై సంస్థ అధినేత మస్క్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కొందరు భారతీయ కుబేరులు తనకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని ముఖేశ్ అంబానీ అని సంబోధిస్తూ మరో పోస్టు పెట్టారు. భారత్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తమ చట్టాలు, నిబంధనలు నిష్పాక్షికంగా, న్యాయంగా ఉంటాయని తేల్చి చెప్పింది.
ఈ వార్తలనూ చదవండి:
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా
ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంకు