Share News

సిల్వర్‌ మళ్లీ క్రాష్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 05:05 AM

వరుసగా రెండు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన విలువైన లోహాల ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా ఢిల్లీ మార్కె ట్లో కిలో వెండి ధర ఒక్కరోజే...

సిల్వర్‌ మళ్లీ క్రాష్‌

  • ఒక్కరోజులో రూ.30,300 పతనమై రూ.2.68 లక్షలకు తగ్గిన కిలో వెండి

  • రూ.1.60 లక్షలకు దిగొచ్చిన బంగారం

న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన విలువైన లోహాల ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా ఢిల్లీ మార్కె ట్లో కిలో వెండి ధర ఒక్కరోజే రూ.30,300 (10.16 శాతం) తగ్గి రూ.2,68,000కు జారుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు రూ.4,500 (దాదాపు 3 శాతం) తగ్గుదలతో రూ.1,60,600కు దిగివచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లోనూ సిల్వర్‌ ఫ్యూచర్స్‌ మార్చి కాంట్రాక్టు ధర రూ.26,850 (10 శాతం) తగ్గి రూ.2,42,000కు జారుకోగా.. గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు రేటు రూ.2,310 (1.51 శాతం) తగ్గుదలతో రూ.1,50,736గా నమోదైంది. అగ్రరాజ్య కరెన్సీ డాలర్‌ మళ్లీ బలపడటం, ప్రామాణిక వడ్డీ రేట్లపై ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరితో పాటు అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రతికూలతల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న విలువైన లోహాలకు గిరాకీ తగ్గింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు 13 శాతం వరకు క్షీణించాయి. ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 137.32 డాలర్లు (2.77 శాతం) తగ్గి రూ.4,827 డాలర్లకు జారుకోగా.. సిల్వర్‌ 11.94 డాలర్లు (13.54 శాతం) పతనమై 76.26 డాలర్లకు దిగివచ్చింది.


బిట్‌కాయిన్‌ 70,000 డాలర్ల దిగువకు..

ప్రపంచ ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ విలువ 2024 నవంబరు తర్వాత తొలిసారిగా 70,000 డాలర్లకు దిగువకు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం ఒక దశలో 11 శాతం క్షీణించి 67,245 డాలర్లకు జారుకుంది. అమ్మకాల ట్రెండ్‌ కొనసాగితే, మున్ముం దు బిట్‌కాయిన్‌ 60,000 డాలర్లకు జారుకోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు భద్రమైన సాధనంగా పేరున్న బంగారంతో పాటు సంప్రదాయ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ డిజిటల్‌ కరెన్సీ విలువ గత ఏడాది అక్టోబరులో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 1.26 లక్షల డాలర్లకు ఎగబాకింది. అయితే, గత కొంతకాలంగా బిట్‌కాయిన్‌ సహా ఇతర క్రిప్టోల విలువ వేగంగా తగ్గుతూ వస్తోంది. వాస్తవిక ప్రపంచంలో వీటి వినియోగంపై ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడటం ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 06 , 2026 | 05:07 AM