రూ. 1 లక్ష మేర పడిపోయిన వెండి! 2 రోజుల్లో భారీ క్రాష్
ABN , Publish Date - Jan 31 , 2026 | 02:18 PM
రెండు రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ. 1 లక్ష మేర పడిపోవడంతో మార్కెట్‌లో కలకలం రేగుతోంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడానికి తోడు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కూడా జనాలకు ఆందోళన తగ్గడంతో గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు వెనక్కు మళ్లాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు నిన్న, నేడు ఊహించని స్థాయిలో కుదుపునకు లోనయ్యాయి. ముఖ్యంగా కిలో వెండి ధర అటు అంతర్జాతీయ మార్కెట్‌లో.. ఇటు దేశీ మార్కెట్‌లో భారీ స్థాయిలో పడిపోయింది. స్పాట్ ధరలు, ఫ్యూచర్స్ ధరలు కూడా ఊహించని రీతిలో తగ్గాయి (Silver Price Crash).
జనవరి 30న దేశంలోని పలు నగరాల్లో వెండి ధర సగటున ఏకంగా రూ.30 వేల మేర తగ్గి రూ.4 లక్షల దిగువకు చేరింది. ఇక నేడు (శనివారం) కూడా ట్రేడింగ్ ఆరంభం నుంచే అమ్మకాలు జోరందుకోవడంతో మరో రూ.65 వేల మేర పడిపోయింది. దీంతో, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెండి స్పాట్ ధర దాదాపు రూ.1 లక్ష మేర పతనం కావడంతో మార్కెట్ వర్గాల్లో సంచలనానికి దారి తీసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో జనవరి 30న స్పాట్ సిల్వర్ ధరలు 25-30 శాతం మేర పతనమయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఫ్యూచర్స్ ధరల్లో కూడా 31 శాతం మేర కోత పడింది. 1980 తరువాత ఈ స్థాయిలో సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పతనం కావడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వారం మొదట్లో ఔన్స్ వెండి సుమారు 120 డాలర్లకు చేరింది. ఆ తరువాత ఒక్క సెషన్‌లోనే 84 డాలర్లకు పడిపోయింది. ఇక అమెరికాలో సిల్వర్ ఈటీఎఫ్స్ ధరలు మరింతగా పతనమయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయని మెజారిటీ మార్కెట్ వర్గాల భావన.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై తలెత్తిన సందేహాలు గతేడాది లోహాల ధరల్లో ర్యాలీకి మరో కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రామాణిక వడ్డీ రేట్లు తగ్గించేందుకు విముఖతో ఉన్న ప్రస్తుత ఫెడ్ ఛైర్‌పర్సన్ జెరోమ్ పావెల్ స్థానంలో శ్వేత సౌధం ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్‌ను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంపిక చేస్తారని అంతా కాస్త ఆందోళన చెందారు. వడ్డీ తగ్గింపుపై కెవిన్ హాసెట్ వైఖరి ట్రంప్‌నకు అనుకూలంగా ఉందన్న భావనతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మళ్లారు. కానీ ట్రంప్ చివర్లో మాజీ ఫెడ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను ఎంపిక చేయడంతో ఇన్వెస్టర్ల ఆందోళన తగ్గింది. ఫెడ్ రిజర్వ్ కార్యకలాపాలు స్వతంత్రంగా సాగాలని భావించే వారిలో కెవిన్ వార్ష్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మళ్లీ అమెరికా ప్రభుత్వ బాండ్స్, డాలర్‌వైపు పెట్టుబడులను మళ్లించడం, ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026: ట్యాక్స్ పేయర్స్‌కు బిగ్ రిలీఫ్ రానుందా.?
కేంద్ర బడ్జెట్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే.!