Share News

యుద్ధం ముగిసె.. మార్కెట్‌ మురిసె..

ABN , Publish Date - Jun 16 , 2026 | 02:29 AM

స్టాక్‌ మార్కెట్లో వరుసగా రెండో రోజూ బుల్‌ సందడి కొనసాగింది. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో పాటు ముడి చమురు మరింత తగ్గి 85 డాలర్ల దిగువకు జారుకోవడంతో...

యుద్ధం ముగిసె.. మార్కెట్‌ మురిసె..

  • సెన్సెక్స్‌ మరో 736 పాయింట్లు అప్‌

  • ఇంట్రాడేలో 24,000 స్థాయికి నిఫ్టీ

  • రెండు రోజుల్లో రూ.18 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

ముంబై: స్టాక్‌ మార్కెట్లో వరుసగా రెండో రోజూ బుల్‌ సందడి కొనసాగింది. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో పాటు ముడి చమురు మరింత తగ్గి 85 డాలర్ల దిగువకు జారుకోవడంతో సోమవారం ట్రేడింగ్‌లో ప్రామాణిక సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,293.12 పాయింట్ల వరకు పెరిగి 76,821.07 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 736.38 పాయింట్ల (0.97 శాతం) లాభంతో 76,264.33 వద్ద స్థిరపడింది. ఒక దశలో 388 పాయింట్లు ఎగబాకి 24,000 మైలురాయిని దాటిన నిఫ్టీ.. ట్రేడింగ్‌ నిలిచేసరికి 231 పాయింట్ల (0.98 శాతం) వృద్ధితో 23,853.90 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.49 లక్షల కోట్లు పెరిగి రూ.470.49 లక్షల కోట్లకు (4.97 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. గడిచిన రెండు సెషన్లలో సెన్సెక్స్‌ 1,695 పాయింట్లు (2.3 శాతం), నిఫ్టీ 461 పాయింట్లు (దాదాపు 2 శాతం) బలపడ్డాయి. మదుపరుల సంపద రూ.18.15 లక్షల కోట్ల మేర పెరిగింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 రాణించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎ్‌ఫఐఐ) విషయానికొస్తే, చాలా రోజుల తర్వాత మళ్లీ కొనుగోళ్ల బాటపట్టారు. సోమవారం ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.200.05 కోట్ల షేర్లను, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.3,189.26 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

4 విభజిత వేదాంత కంపెనీల లిస్టింగ్‌

వేదాంత గ్రూప్‌ వ్యాపారాల ఆధారంగా విభజించిన 4 కంపెనీల షేర్లను సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. అందులో వేదాంత అల్యూమినియం మెటల్‌ షేరు బీఎ్‌సఈలో రూ.527 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి, ఆ తర్వాత 5 శాతం తగ్గి లోయర్‌ సర్క్యూట్‌ స్థాయి రూ.500.65 వద్ద ముగిసింది. వేదాంత పవర్‌ స్టాక్‌ రూ.41.30 వద్ద లిస్ట్‌ అయి.. 0.84 శాతం నష్టంతో రూ.40.95 వద్ద క్లోజైంది. వేదాంత ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రూ.39 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి, ఆ తర్వాత 5 శాతం నష్టంతో లోయర్‌ సర్క్యూట్‌ స్థాయి రూ.37.05 వద్ద స్థిరపడింది. వేదాంత ఐరన్‌ అండ్‌ స్టీల్‌ రూ.22.25 వద్ద లిస్టయింది. చివరికి 5.39 శాతం నష్టపోయి రూ.21.05 వద్ద ముగిసింది.


ఐపీఓకు రేజర్‌పే

ఫిన్‌టెక్‌ కంపెనీ రేజర్‌పే తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) కు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓ వివరాలను గోప్యంగా ఉంచేందుకు కంపెనీ కాన్ఫిడెన్షియల్‌ ఫైలింగ్‌ను ఎంచుకుంది. అయితే, పబ్లిక్‌ ఆఫరింగ్‌ ద్వారా కంపెనీ రూ.5,000-6,000 కోట్ల వరకు సమీకరించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

  • అద్విత్‌ జువెల్స్‌ రూ.165 కోట్ల ఐపీఓ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.130-138గా నిర్ణయించింది.

రూపీ-క్రూడ్‌-గోల్డ్‌

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 60 పైసలు పెరిగి రూ.94.58 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గడం ఇందుకు తోడ్పడ్డాయి.

  • అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారల్‌ ధర ఒక దశలో 4.97 శాతం తగ్గి 82.99 డాలర్లకు దిగివచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగియడం, త్వరలో హోర్ముజ్‌ జలసంధి తెరుచుకోనుండటం ఇందుకు కారణం.

  • బంగారం ధరలు వరుసగా రెండో రోజూ ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో రూ.2,500 పెరిగి రూ.1,59,400కు చేరగా.. కిలో వెండి రూ.5,000 ఎగబాకి రూ.2,60,700 ధర పలికింది. అమెరికా-ఇరాన్‌ మధ్య డీల్‌ కుదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు మరింత పెరగడం ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 121 డాలర్ల మేర ఎగబాకి 4,340 డాలర్లకు చేరగా.. సిల్వర్‌ 70 డాలర్ల ఎగువన ట్రేడైంది.

ఇవి కూడా చదవండి..

ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..

Updated Date - Jun 16 , 2026 | 02:29 AM