Share News

2027 డిసెంబరు నాటికి సెన్సెక్స్‌ @:1,05,000!

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:03 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ మరింత పుంజుకోనుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ అభిప్రాయపడింది. 2027 డిసెంబరు నాటికి...

2027 డిసెంబరు నాటికి సెన్సెక్స్‌ @:1,05,000!

మోర్గాన్‌ స్టాన్లీ అంచనా

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ మరింత పుంజుకోనుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ అభిప్రాయపడింది. 2027 డిసెంబరు నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రస్తుత స్థాయితో పోలిస్తే, దాదాపు 16 శాతం వృద్ధితో 95,000 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇందుకు 50 శాతం అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ చీఫ్‌ ఇండియా స్ట్రాటజిస్ట్‌, ఎండీ రిధమ్‌ దేశాయ్‌ అన్నారు. మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగితే సెన్సెక్స్‌ 1.05 లక్షల పాయింట్లకు చేరవచ్చని, ఇందుకు 30 శాతం అవకాశం ఉందన్నారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో మార్కెట్‌ మళ్లీ దిద్దుబాటుకు లోనుకావచ్చని, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సెన్సెక్స్‌ 68,000 స్థాయికి పడిపోయే ప్రమాదమూ లేకపోలేదని మోర్గాన్‌ స్టాన్లీ హెచ్చరించింది. అయితే, ఇందుకు అవకాశాలు 20 శాతమేనని తాజా నోట్‌లో పేర్కొంది.

82,000 పైకి సెన్సెక్స్‌: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం బాగానే లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 512.34 పాయింట్లు ఎగబాకి 82,104.79 వద్దకు చేరింది. నిఫ్టీ 146.80 పాయింట్ల వృద్ధితో 25,291.10 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 20 రాణించగా.. ఐటీసీ షేరు 3.78 శాతం లాభంతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్ను, చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. బీఎస్‌ఈలోని మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీలు మాత్రం వరుసగా 0.92 శాతం, 0.71 శాతం తగ్గాయి. దాంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.98,000 కోట్లు తగ్గి రూ.509.20 లక్షల కోట్లకు పరిమితమైంది. కాగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) నికరంగా రూ.4,864.68 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) మాత్రం రూ.3,519.05 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

19న మహానది కోల్డ్‌ఫీల్డ్స్‌ ఐపీఓ: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ రూ.8,981 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ) ఈనెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. ఈ ఇష్యూ ధరల శ్రేణిని కంపెనీ రూ.129-136గా నిర్ణయించింది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్ఎస్‌) ద్వారా జరగనుంది.

ఇవీ చదవండి

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

కనపడని డాక్టర్‌..ఏఐ

Updated Date - Nov 17 , 2026 | 06:07 AM