కుటుంబ పొదుపు, సంపద సృష్టికి క్యాపిటల్ మార్కెట్లు కీలకం
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:55 AM
దేశంలో కుటుంబ పొదుపు, సంపద సృష్టికి క్యాపిటల్ మార్కెట్లు కీలక మార్గంగా మారుతున్నాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. దేశ ఆర్థిక వృద్ధిలో...
ముంబై: దేశంలో కుటుంబ పొదుపు, సంపద సృష్టికి క్యాపిటల్ మార్కెట్లు కీలక మార్గంగా మారుతున్నాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. దేశ ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకోవడంతోపాటు వారి పెట్టుబడుల్లో నిర్మాణాత్మక మార్పును ఇది ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో సోమవారం ప్రారంభమైన ‘ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ 2026’లో పాల్గొన్న సందర్భంగా పాండే ఇంకా ఏమన్నారంటే..
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసె్‌స (పీఎంఎస్)కు సంబంధించి విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేస్తాం.
భారత ఆర్థిక వృద్ధి కేవలం గరిష్ఠ స్థాయి జీడీపీ గణాంకాలు మాత్రమే కాదు. ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చడం, పొదుపు ఆర్థికీకరణ, ప్రభుత్వ సంస్థలపై నమ్మకం పెంచడం కూడా.
దేశీయ సెక్యూరిటీస్ మార్కెట్లో ప్రస్తుతం 14.5 కోట్ల మంది మదుపు చేస్తున్నారు. ఈ ఇన్వెస్టర్లు ఏటేటా 20 శాతానికి పైగా పెరుగుతున్నారు.
గడిచిన కొన్నేళ్లలో దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ.80 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. క్యాపిటల్ మార్కెట్లో కుటుంబాల పెట్టుబడులు నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశీయ కుటుంబాల ఆర్థిక పొదుపు వాటా మన జీడీపీలో 20 శాతంగా ఉండగా.. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 21.7 శాతానికి పెరిగింది. క్యాపిటల్ మార్కెట్లోని అన్ని ఆర్థిక సాధనాల్లోకి కుటుంబ పొదుపు సొమ్ము పెట్టుబడుల రూపం లో వచ్చి చేరుతుండటం ఇందుకు దోహదపడింది. కుటుంబాలు తమ పొదుపు సొమ్మును మార్కెట్ అనుసంధానిత మార్గాల్లోకి మళ్లించడం పెరిగిందని దీన్ని బట్టి అవగతమవుతున్నది.
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈక్విటీల జారీ రూ.4.5 లక్షల కోట్లకు చేరింది. 366 కంపెనీలు ఐపీఓల ద్వారా ప్రైమరీ మార్కెట్ నుంచి రూ.1.9 లక్షల కోట్లు సమీకరించాయి. కార్పొరేట్ బాండ్ల జారీ రూ.9 లక్షల కోట్లు దాటింది. పెట్టుబడుల్లో పెరుగుతున్న మార్కెట్ పాత్రను ఇది నొక్కి చెబుతున్నది.
దశాబ్దం క్రితం భారత స్టాక్ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) జీడీపీలో 69 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 128 శాతానికి పెరిగింది. మధ్యలో మార్కెట్లు భారీగా దిద్దుబాటుకు లోనైనప్పటికీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
మదుపరుల పరిధి విస్తృతమవుతున్న నేపథ్యంలో పారదర్శకత, ఇన్వెస్టర్ల ప్రయోజనాల సంరక్షణ, మార్కెట్ సమగ్రతను కాపాడే విషయంలో నియంత్రణ మండళ్లు, మార్కెట్ సంస్థలపై బాధ్యత మరింత పెరిగింది.
ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణ, మార్కెట్లోకి సులభతర ప్రవేశం, మార్కెట్ అభివృద్ధిని సంతులనం చేసేలా నిబంధనలు ఏర్పాటు చేయడమే క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థగా సెబీ విధానం.
పెట్టుబడుల సమీకరణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులకు అనుకూలంగా మార్చడం, కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను విస్తృతం, మార్కెట్ సంస్థలపై నిబంధనల భారం తగ్గింపు కోసం సెబీ గడిచిన కొన్నేళ్లలో పలు సంస్కరణలు చేపట్టింది.
మార్కెట్‌కు ఇన్వెస్టర్లే కీలకం. కాబట్టి ప్రతి సంస్కరణ అంతిమంగా మదుపరిలో విశ్వాసాన్ని పెంచగలగాలి. అప్పుడే వారి పెట్టుబడులతో పాటు మార్కెట్ బలంగా, సుస్థిర పునాదిపై వృద్ధి చెందుతుంది.
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
ఇవి కూడా చదవండి..
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన.