Share News

రూ.10 లక్షల కోట్ల క్లబ్‌లో ఎస్‌బీఐ

ABN , Publish Date - Feb 11 , 2026 | 06:17 AM

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌...

రూ.10 లక్షల కోట్ల క్లబ్‌లో ఎస్‌బీఐ

ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీ

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తర్వాత ఈ స్థాయి మార్కెట్‌ విలువ సాధించిన ఆరో భారత లిస్టెడ్‌ కంపెనీ ఇదే. ప్రస్తుతం మార్కెట్లోని అత్యంత విలువైన కంపెనీల్లో ఆరో స్థానం కూడా ఎస్‌బీఐదే. అంతేకాదు, మార్కెట్‌ విలువపరంగా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంక్‌గానూ అవతరించింది. ఆరేళ్ల పైబడిన విరామం తర్వాత ఎస్‌బీఐ మళ్లీ ఐసీఐసీఐ బ్యాంక్‌ను మూడో స్థానానికి నెట్టింది.

సరికొత్త రికార్డు స్థాయికి షేరు ధర

బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు ధర మంగళవారం ఒకదశలో దాదాపు ఒక శాతం పెరిగి రూ.1,153.85 స్థాయి వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. రికార్డు గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో చివరికి 0.16 శాతం నష్టంతో రూ.1,144.10 వద్ద ముగిసింది. దాంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.10.56 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు ఎస్‌బీఐ షేరు 6 శాతానికి పైగా వృద్ధి చెందగా.. జనవరిలోనూ 10 శాతం ఎగబాకింది. గడిచిన ఏడాది కాలంలో 67.5 శాతం పుంజుకుంది.

ఎల్‌ఐసీకి రూ.40,000 కోట్ల లాభం

దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ (డీఐఐ) అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి ఎస్‌బీఐలో 9.23 శాతం వాటా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఎస్‌బీఐ షేరు వేగంగా పెరుగుతూ రావడంతో ఈ బ్యాంక్‌లోని ఎల్‌ఐసీ ఈక్విటీ వాటా విలువ కూడా దాదాపు రూ.40,000 కోట్ల మేర వృద్ధి చెంది మొత్తం రూ.98,353 కోట్లకు చేరుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 06:17 AM