ఏఐ వినియోగంపై జర జాగ్రత్త
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:00 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్ ఉపయోగించే విషయలో బ్యాంకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కోరారు...
తప్పులు దొర్లితే కొంప కొల్లేరే.. ఎస్‌బీఐ చీఫ్ చల్లా శ్రీనివాసులు శెట్టి
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్ ఉపయోగించే విషయలో బ్యాంకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కోరారు. ఈ టూల్స్ వినియోగంలో ఏమైనా తప్పులు జరిగితే, పరస్పరం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థపై పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అదే జరిగితే ఆర్థిక సంస్థల నిర్వహణ సమస్యగా మారుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకుల్లో వినియోగించే ఏఐ టూల్స్‌కు లావాదేవీల పరిమితులు, ఆడిటింగ్, మానవ జోక్యం విధానాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉండాలని ఎస్‌బీఐ చీఫ్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఏఐ టూల్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ చీఫ్ ఈ హెచ్చరిక చేయడం విశేషం. ఏఐ టూల్స్‌తో ఉద్యోగుల పనితీరు పెరిగినా, కొన్ని సమస్యలు కూడా ఉంటాయనే విషయం మరువకూడదన్నారు. ఏఐ టూల్స్ ఏ సమాచారాన్ని అందుకోవచ్చు? అవి ఏయే నిర్ణయాలు తీసుకోవచ్చు? ఏయే సందర్భాల్లో మాన వ జోక్యం అవసరం అనే విషయాలకు సంబంధించి బ్యాంకులకు పూర్తి స్పష్టత ఉండాలన్నారు.
బోర్డులదే బాధ్యత: ఏఐ టూల్స్ వినియోగం విషయంలో బ్యాంకుల బోర్డులదే తుది నిర్ణయమన్నారు. ఏఐ తప్పులతో తలెత్తే పర్యవసానాలు అవగాహన చేసుకునేందుకు బ్యాంకుల బోర్డు సభ్యులు కూడా ఏఐ టూల్స్ నేర్చుకోక తప్పదన్నారు. ఏఐ టూల్స్‌ను ఏదో సాంకేతిక మార్పుగా కాకుండా బ్యాంకుల అవసరాలను బట్టి వినియోగించాలన్నారు. ఏది ఏమైనా ఏఐ టూల్స్ ఉద్యోగుల పనితీరు పెంచే అదనపు సాధనాలే తప్ప, వారి విధులను అవి పూర్తిగా భర్తీ చేయలేవని శెట్టి స్పష్టం చేశారు. ఈ టూల్స్ రుణ వితరణలో వివక్ష చూపేలా కూడా ఉండకూడదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..