అక్టోబర్ 1 నుంచి అమల్లోకి ఏటీఎమ్ కొత్త రూల్స్.. పరిమితి దాటితే చార్జీలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:47 PM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ నిబంధనలను సవరించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎమ్‌ల ద్వారా పొందే ఉచిత లావాదేవీల సంఖ్యను కుదించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్1 నుంచి అమలులోకి రానున్నాయి.
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్స్ ఖాతాదారులకు సంబంధించిన ఏటీఎమ్ నిబంధనలను సవరించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇతర ఏటీఎమ్‌ల ద్వారా పొందే ఉచిత లావాదేవీల సంఖ్యను 10 నుంచి 5కు తగ్గించింది. ఈ పరిమితిని మించి లావాదేవీలు చేసినట్లయితే ఖాతాదారుల అకౌంట్ నుంచి చార్జీలు వసూలు చేస్తారు.
ఇంతకముందు ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్స్ కలిగిన ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎమ్‌ల నుంచి నగదు తీసుకోవాలన్నా, ఇతర నగదు రహిత సేవలు పొందాలన్నా.. 10 లావాదేవీల వరకు ఉచితంగా పొందవచ్చు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం.. ఈ లావాదేవీల సంఖ్య 5కు తగ్గింది.
ఏటీఎం సెంటర్ల నుంచి ఐదుసార్ల కంటే ఎక్కువ సార్లు నగదు విత్‌డ్రా చేసినట్లయితే రూ.23తో పాటు జీఎస్టీ చార్జీలు వసూలు చేస్తారు. పరిమితిని మించి చేసే ప్రతి నగదు రహిత లావాదేవీపై రూ.11 చార్జీతో పాటు జీఎస్టీ చార్జీలు వసూలు చేస్తారు. అయితే, ఎస్‌బీఐ ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎమ్ సేవలను అపరిమితంగా వినియోగించవచ్చు.