Share News

ఈ ఏడాది వేతన పెంపు 12 శాతం!

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:07 AM

దేశంలో కొలువుల మార్కెట్‌ క్రమంగా కోలుకుంటోంది. దీంతో ఉద్యోగాల జీతాల్లోనూ స్థిరీకరణ ప్రారంభమైంది. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ఉద్యోగుల జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు...

ఈ ఏడాది వేతన పెంపు 12 శాతం!

  • కోలుకుంటున్న ఉద్యోగ మార్కెట్‌

  • ప్రారంభమైన ‘జీతాల’ స్థిరీకరణ

  • మైఖేల్‌ పేజ్‌ ఇండియా నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కొలువుల మార్కెట్‌ క్రమంగా కోలుకుంటోంది. దీంతో ఉద్యోగాల జీతాల్లోనూ స్థిరీకరణ ప్రారంభమైంది. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ఉద్యోగుల జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండే అవకాశం ఉందని కంపెనీలకు నియామకాల సేవలందించే మైఖేల్‌ పేజ్‌ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. సరికొత్త నైపుణ్యాలు ఉన్న వృత్తి నిపుణులు, టెకీలు ఉద్యోగాలు మారితే కొత్త కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్‌ చేస్తున్నట్టు ‘ది శాలరీ గైడ్‌- 2026’ పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. సరికొత్త టెక్‌ నైపుణ్యాలతో పాటు నాయకత్వ స్థానాల్లో ఉన్న చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్లు (సీఎ్‌ఫఓ), చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు (సీటీఓ), హెడ్స్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగులను కంపెనీలు ప్రస్తుతం ఎగిరేసుకుపోతున్నాయని పేర్కొంది.

ట్రెండ్‌ మార్చిన

కంపెనీలు

కంపెనీలు గతంలోలా మూకుమ్మడి నియామకాలపై ఆసక్తి చూపడం లేదు. తమ వృద్ధికి బాటలు వేసే సామర్ధ్యం ఉన్న నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను మాత్రమే ఏరికోరి తీసుకుంటున్నాయి. ఇందుకోసం అభ్యర్థుల్లో ప్రత్యేక నైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలు, వారికి ఉద్యోగాలు ఇస్తే దీర్ఘకాలంలో కంపెనీకి విలువ జోడించగలరా? లేదా? అని చూస్తున్నట్టు మైఖేల్‌ పేజ్‌ ఇండియా సీనియర్‌ ఎండీ నిలయ్‌ ఖండేల్వాల్‌ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి కూడా కంపెనీల నియామకాలను ప్రభావితం చేస్తోంది. అయుతే పెరుగుతున్న దేశీయ వినియోగంతో కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న నిపుణుల నియామకాలు చేపడుతున్నాయి.


కాంట్రాక్టు నియామకాలు

కంపెనీలు గతంలోలా పర్మినెంట్‌ ఉద్యోగుల నియామకాలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐటీ కంపెనీల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా నియమిత కాలానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను కాంట్రాక్టు పద్దతిలో తీసుకుని పని పూర్తి చేస్తున్నాయి. పర్మినెంట్‌ ఉద్యోగులతో పోలిస్తే వీరికి 30 నుంచి 40 శాతం వరక అధిక జీతాలు చెల్లిందుకు సైతం వెనకాడడం లేదు. దీంతో సాఫ్ట్‌వేర్‌, డేటా, డిజిటల్‌ డిజైన్‌ నిపుణులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది.

జీసీసీ ప్రాధాన్యత

ప్రస్తుతం దేశీయ నియామకాల్లో జీసీసీలు కీలకంగా మారాయి. అనేక అంతర్జాతీయ దిగ్జజ సంస్థలు మన దేశంలో తమ జీసీసీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఐటీ కంపెనీలతో పోలిస్తే ఈ సంస్థలు టెకీలకు 20 నుంచి 25 శాతం అధిక జీతాలు ఆఫర్‌ చేయడంతో చాలా మంది టెకీలు జీసీసీల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 04:07 AM