Share News

రూపాయి @ 91.65

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:52 AM

మన ఆర్థిక పునాదులు యమ స్ట్రాంగ్‌ అని ప్రభుత్వం చెబుతునా.. ఆ ప్రభావం రూపాయి మారకం రేటుపై కనిపించడం లేదు. డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకీ దిగజారిపోతోంది...

రూపాయి @ 91.65

డాలర్‌ మారకంలో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి పతనం.. రానున్న రోజుల్లో మరింత క్షీణించే చాన్స్‌

ముంబై: మన ఆర్థిక పునాదులు యమ స్ట్రాంగ్‌ అని ప్రభుత్వం చెబుతునా.. ఆ ప్రభావం రూపాయి మారకం రేటుపై కనిపించడం లేదు. డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకీ దిగజారిపోతోంది. బుధవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌ మారకంలో ఒక్కరోజే 68 పైసలు నష్టపోయి రూ.91.65 వద్ద ముగిసింది. గత ఏడాది నవంబరు 21 తర్వాత డాలర్‌తో రూపాయి విలువ ఒకేరోజు ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొదటిసారి. ఆ రోజు డాలర్‌తో రూపాయి మారకం రేటు 98 పైసలు నష్టపోయింది. బుధవారం ఇంట్రాడేలో ఒక దశలో రూపాయి మారకం రేటు 91.74 వరకు నష్టపోయింది. పెట్టుబడుల ప్రవాహంలో నెలకొన్న ఆటుపోట్లతో భారత్‌తో సహా అనేక వర్థమాన దేశాల కరెన్సీలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగం ప్రధాన అధికారి అభిషేక్‌ బైసెన్‌ చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకు డాలర్‌ తో రూపాయి మారకం రేటు 1.5 శాతం మేర క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింత పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.


పతనానికి కారణాలు

గ్రీన్‌లాండ్‌పై అమెరికా-ఈయూ దేశాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం, దేశీయ స్టాక్‌ మార్కెట్లో కొనసాగుతున్న బేర్‌ ఆపరేటర్ల పట్టు, ఎఫ్‌పీఐల అమ్మకాలు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మారకం రేటును కుంగదీస్తున్నాయి. రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) జోక్యం చేసుకోకపోవడం కూడా రూపాయి పతనానికి కారణంగా ఉంది. అయితే ఏదో ఒక ప్రధాన సానుకూల పరిణామం చోటు చేసుకోకపోతే డాలర్‌ మారంకంలో రూపాయి త్వరలోనే 92 మార్కును అధిగమించే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

లాభమెంత.. నష్టమెంత..

రూపాయి పతనంతో బంగారం, వెండి, ముడి చమురు వంటి వస్తువుల దిగుమతులు మరింత భారం కానున్నాయి. విదేశాల్లో తమ పిల్లలను చదివించే తల్లిదండ్రులపైనా మరింత భారం పడనుంది. సీమ సరుకులు ఇష్టపడే వినియోగదారులపైనా అదనపు భారం తప్పదు. అయితే డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం, డీలాపడిన మన ఎగుమతులకు కొద్దో గొప్పో కలిసి రానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో ఈ పరిణామం మన ఎగుమతులకు గుడ్డిలో మెల్లలా తోడ్పడనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

Updated Date - Jan 22 , 2026 | 05:52 AM