డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ
ABN , Publish Date - May 15 , 2026 | 03:58 PM
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఇవాళ సరికొత్త రికార్డు కనిష్ఠానికి (96.14) పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి కొన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, మే 15: ఇవాళ (శుక్రవారం), అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఒక దశలో 96.14 వద్ద రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం.. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ మరింత బలపడటానికి కారణమైంది. తద్వారా రూపాయి విలువ మధ్యాహ్నం గం.3 ప్రాంతానికి రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. అనంతరం కోలుకొని మధ్యాహ్నం నాలుగున్నర సమయానికి 95.82 దగ్గర కదలాడుతోంది.
ఈ వారం నమోదైన రూపాయి విలువ కనిష్ఠాల పరంపరలో ఇది ఆల్ టైం పతనం. దేశ విదేశీ మారక నిల్వలను పరిరక్షించేందుకు పలు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన కొన్ని రోజులకే దేశీయ కరెన్సీ జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం విశేషం. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభం, చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోయిన పరిణామాలు రూపాయి విలువ పతనానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
చాలా మంది ఆర్థికవేత్తలు, వివిధ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను తగ్గించగా, ద్రవ్యోల్బణ అంచనాలను పెంచారు. మరోవైపు, అధికారిక టోకు ధరల సూచీ(WPI) దాదాపు నాలుగేళ్ల అత్యధిక స్థాయికి చేరుకుంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే సంకేతాల వల్ల డాలర్ ఇండెక్స్ బలపడిందని కూడా విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో రూపాయి విలువ మరీ ఎక్కువగా పడిపోకుండా నిరోధించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రంగంలోకి దిగి, డాలర్లను విక్రయించడం ద్వారా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు, రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి...
నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర
బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ: సీఎం చంద్రబాబు