Share News

ఎఫ్‌పీఐల అమ్మకాలతోనే రూపాయికి తిప్పలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:11 AM

ఇరాన్‌ యుద్ధం, చమురు సెగతోనే డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోతోందన్న వాదనను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. దేశీయ స్టాక్‌ మార్కెట్లో...

ఎఫ్‌పీఐల అమ్మకాలతోనే రూపాయికి తిప్పలు

ముడి చమురు సెగ ఒక కారణం మాత్రమే

ధరల సెగను కట్టడి చేసేందుకే రెపో రేటు పెంపు

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సుబ్బారావు

న్యూఢిల్లీ: ఇరాన్‌ యుద్ధం, చమురు సెగతోనే డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోతోందన్న వాదనను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. దేశీయ స్టాక్‌ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) భారీ అమ్మకాలే ఇందుకు ప్రధాన కారణమన్నారు. అధిక చమురు ధర కూడా ఇందుకు కలిసి వస్తోందన్నారు. ఇరాన్‌ యుద్ధాని కంటే ముందు నుంచే.. గడిచిన కొద్ది సంవత్స,రాలుగా రూపాయి పతనం ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇరాన్‌ యుద్ధం ముగిసి, చమురు ధర తగ్గితే పరిస్థితులు కుదుటపడతాయని భావించడం తప్పుడు అవగాహనే అవుతుందని స్పష్టం చేశారు. అమెరికా-భారత వడ్డీ రేట్ల మధ్య తేడా తగ్గిపోవడమూ ఎఫ్‌పీఐల అమ్మకాలకు మరో కారణమన్నారు.

మన మార్కెట్‌ కాస్ట్‌లీ : అధిక రాబడుల కోసం చూసే ఎఫ్‌పీఐలకు.. భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుత వాల్యుయేషన్స్‌ ఇంకా అధికంగానే కనిపిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు. ఎఫ్‌పీఐల అమ్మకాలతో కుదేలవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను ప్రస్తుతం గృహ పొదుపులే ఆదుకుంటున్నట్టు తెలిపారు. ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో భారీగా పెరుగుతున్న రిటైల్‌ మదుపరుల పెట్టుబడులను సుబ్బారావు గుర్తు చేశారు. ఎఫ్‌పీఐలు ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలో నాయకత్వ స్థానంలో ఉన్న అమెరికా కంపెనీల్లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతున్న విషయాన్నీ గుర్తు చేశారు. అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో మన దేశం కూడా ప్రధాన శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

వృద్ధి రేటు ఒక్కటే చాలదు: అధిక జీడీపీ వృద్ధి రేటు, బలమైన రూపాయి మాత్రమే ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆశించడమూ అత్యాశే అవుతుందని సుబ్బారావు అన్నారు. ఉత్పాదక, ఎగుమతి సామర్ధ్యం పెంచుకోవడం, అనవసరమైన లావాదేవీల ఖర్చులు తగ్గించడం, విధానపరమైన అనిశ్చితిని తొలగించడం, అధునాతన టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం ద్వారా మాత్రమే ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. కరెంట్‌, మూలధన ఖాతాలను పటిష్ఠం చేసుకోవడం ద్వారా రూపాయి మారకం రేటునూ పెంచుకోవచ్చన్నారు.


రెపో రేటు పెంపు సరైందే: ఆర్‌బీఐ ఇటీవల కీలక రెపో రేటు పావు శాతం పెంచడాన్ని సుబ్బారావు సమర్ధించారు. ద్రవ్యోల్బణం కోరలు చాస్తున్న వేళ ధరల సెగకు కళ్లెం వేయాలంటే ఈ పెంపు తప్పదన్నారు. అయితే ఇదే సమయంలో వృద్ది రేటును, ఆర్థిక స్థిరత్వాన్ని విస్మరించకూడదన్నారు. ముడి చమురు ధర కొండెక్కడం, ఎల్‌నినో కారణంగా వరుణుడు కరుణించక పోవడం వల్లే ప్రస్తుం దేశంలో ద్రవ్యోల్బణం కోరలు చాస్తోందన్నారు. ఇటీవల ప్రవాస భారతీయుల నుంచి ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్ల ద్వారా పెద్దమొత్తంలో బ్యాంకులు నిధులు సమీకరించడాన్ని సుబ్బారావు సమర్ధించారు. దీన్ని డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింత తగ్గకుండా అడ్డుకునే అత్యవసర చర్యగా సుబ్బారావు అభివర్ణించారు.

Also Read:

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో

ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే

Updated Date - Oct 20 , 2026 | 06:11 AM