బియ్యం మీద జీఎస్‌టీ చెల్లించాలా..?
ABN , Publish Date - Aug 23 , 2026 | 03:06 AM
బియ్యం నిత్యావసర వస్తువు. దక్షిణ భారతంలో ప్రధాన ఆహార పంట. మరి బియ్యంపైనా జీఎస్‌టీ ఉందా అనే విషయంలో కొంత గందరగోళం ఉంది. కొన్ని దుకాణాల్లో జీఎస్‌టీ వసూలు చేస్తుండగా..
బియ్యం నిత్యావసర వస్తువు. దక్షిణ భారతంలో ప్రధాన ఆహార పంట. మరి బియ్యంపైనా జీఎస్‌టీ ఉందా అనే విషయంలో కొంత గందరగోళం ఉంది. కొన్ని దుకాణాల్లో జీఎస్‌టీ వసూలు చేస్తుండగా.. మరి కొన్ని చోట్ల పన్ను ఊసే ఉండటం లేదు. దీనిపై కొనుగోలుదారులతోపాటు చిన్న దుకాణాల యజమానుల్లోనూ పెద్దగా అవగాహన లేదు. అసలు బియ్యంపై జీఎస్‌టీ వర్తిస్తుందా..? లేదా..? అంటే, రెండూ అని చెప్పాల్సి ఉంటుంది. అనగా, ఒకే బియ్యం ఒక సందర్భంలో జీఎస్‌టీకి లోబడి ఉండవచ్చు. మరో సందర్భంలో జీఎస్‌టీ లేకుండానే అమ్మవచ్చు. ఏ సందర్భంలో జీఎస్‌టీ వర్తిస్తుంది..? ఎప్పుడు జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు..? అనే విషయాలను తెలుసుకుందాం..
2022కు ముందు బియ్యం, పప్పు దినుసులు జీఎస్‌టీ పరిధిలోకి రావాలంటే బ్యాగ్‌పై బ్రాండ్ పేరు ముద్రించి ఉండాలి. 2022 నుంచి నిబంధనలు మారాయి. కొత్త రూల్స్ ప్రకారం.. ప్రీ-ప్యాకేజ్డ్ మరియు లేబుల్డ్ అయి ఉండి 26 కిలోల లోపల (25 కేజీలు, అంతకంటే తక్కువ) ఉంటేనే పన్ను వర్తిస్తుంది.
ప్రీ-ప్యాకేజ్డ్ అంటే..?
వినియోగదారుడు దుకాణానికి వెళ్లే సరికి అవి అమ్మకానికి వీలుగా సంచులలో లేదా డబ్బాలలో, సీసాలలో ఉండాలి. ఉదాహరణకు, బాస్మతి బియ్యం కంపెనీని బట్టి కిలో, 2 కిలోల ప్యాకెట్ లేదా సీసాల్లో వస్తున్నాయి. అలాగే, సూపర్ మార్కెట్లలో బియ్యం 5, 10, 25 కేజీల ప్యాకెట్లు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ ప్రీ-ప్యాకేజ్డ్ అని అర్థం. ఇలా ముందే ప్యాకింగ్ చేసిన ఏ బియ్యం అయినా 25 కేజీలు అంతకంటే తక్కువ బరువుండటం మొదటి నిబంధన.
లేబులింగ్ అంటే..?
తూనికలు, కొలతలు చట్టం ప్రకారం.. ప్యాకెట్‌పై కొంత సమాచారాన్ని ముద్రించవలసి ఉంటుంది. ఉదాహరణకు.. సరుకు లేదా వస్తువు వివరాలు, పేరు, నికర బరువు, తయారీదారు లేదా ప్యాకర్ వివరాలు, ధర తదితర వివరాలను ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ముద్రించి ఉంటే ఆ ప్యాకెట్‌పై లేబుల్ ఉన్నట్లు అర్థం. అంటే, 25 కేజీలు, అంతకంటే తక్కువ బరువు ఉండి, ముందే ప్యాకింగ్ చేసి ఉండి, లేబుల్ కూడా ముద్రించి ఉంటే అప్పుడు జీఎ్‌సటీ వర్తిస్తుంది. ఒకవేళ మొదటి రెండు నిబంధనల కిందకు వచ్చి, లేబుల్ ముద్రించకుండా ఉంచినా జీఎ్‌సటీ వర్తిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. లేబుల్ నిజంగా ముద్రించారా లేదా అన్నది మాత్రమే ముఖ్యం కాదు. తూనికలు, కొలతల చట్టం ప్రకారం ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం ఉందా అన్నదే ముఖ్యం. నిబంధనల ప్రకారం.. 25 కేజీలు అంతకంటే తక్కువ బరువున్న ప్రీ-ప్యాకేజ్డ్ సరుకులపై లేబుల్ ముద్రించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు.. 20 కిలోల బియ్యం ప్యాకెట్‌పై వ్యాపారి వివరాలు ముద్రించకుండా అమ్మినంత మాత్రాన ‘లేబుల్ లేదు కాబట్టి జీఎ్‌సటీ లేదు’ అని చెప్పలేడు. మరి అలాంటప్పుడు లేబుల్‌కు అంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, 25 కేజీలు లేదా అంతకంటే తక్కువ బరువు ఉండి, లేబుల్ ముద్రించాల్సిన అవసరం లేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. పారిశ్రామిక లేదా సంస్థాగత వినియోగదారులకు సరుకు అమ్ముతుంటే లేబుల్ అవసరం లేదు. అంటే, హాస్పిటల్ లేదా ఇతర పరిశ్రమల్లో క్యాంటీన్ లేదా హోటళ్లకు అమ్ముతున్నప్పుడు 25 కేజీలు, అంతకంటే తక్కువ బరువున్న సరుకైనా లేబుల్ వేయాల్సిన అవసరం లేదు. అయితే, నేరుగా రైస్ మిల్లు లేదా హోల్‌సేల్ డీలర్ నుంచి కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. అలాకాకుండా, రిటైల్ షాపు నుంచి హాస్పిటల్ తన క్యాంటీన్‌కు కావాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేస్తే, అప్పుడు లేబుల్ మినహాయింపు ఉండదు కాబట్టి జీఎ్‌సటీ వర్తిస్తుంది.
మరికొన్ని ముఖ్య విషయాలు..
ఓ వ్యాపారి ఒక్కొక్కటీ 10 కిలోల బరువున్న బియ్యం ప్యాకెట్లను పదింటిని ఒకే సంచిలో పెట్టి పంపాడనుకుందాం.. అప్పుడు సంచి మొత్తం బరువు 100 కిలోలు అవుతుంది. వంద కిలోల సంచి కాబట్టి జీఎ్‌సటీ లేదు అని చెప్పలేం. ఎందుకంటే, సంచి లోపల ఒక్కొక్కటీ 10 కిలోల బరువుతో కూడిన పది విడి ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి. ఈ సందర్భంలో మొత్తం బరువును కాకుండా విడి ప్యాకెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, బరువుతో సంబంధం లేకుండా కస్టమరుకు కావాల్సినంత మేరకే (ఉదాహరణకు 5, 10 కేజీలు) తూకం వేసి విక్రయిస్తే జీఎ్‌సటీ వర్తించదు.
స్థూలంగా చెప్పాలంటే, జీఎ్‌సటీ వర్తిస్తుందా లేదా నిర్ణయించడానికి బియ్యం ముందుగానే ప్యాక్ చేసి ఉందా లేదా అని చూడాలి. అది 25 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే జీఎ్‌సటీ వర్తించదు. 25 కేజీలు, అంతకంటే తక్కువ బరువు ఉంటే జీఎ్‌సటీ వర్తిస్తుంది. పారిశ్రామిక లేదా సంస్థాగత వినియోగదారులకు విక్రయంలో జీఎ్‌సటీ మినహాయింపు ఉంది. కాబట్టి, అమ్మకందారులతోపాటు కొనుగోలుదారులు కూడా ఈ విషయాలను గమనించాలి.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్