రుణాలకు రె‘పోటు’
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:02 AM
ఇప్పటికే మార్కెట్లో ధరలు మండిపోతున్నాయ్.. ఇక రుణాలు సైతం ప్రియం కానున్నాయి. కొత్తగా తీసుకోబోయే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లతోపాటు ఇదివరకే తీసుకున్న అప్పులపై నెలవారీ కిస్తీ చెల్లింపుల (ఈఎంఐ) భారం...
రుణాలిక ప్రియం.. ఈఎంఐలు మరింత భారం
రెపో రేటు 0.25% పెంపు.. 5.50 శాతానికి చేరిక.. నాలుగేళ్లలో ఇదే తొలి పెంపు
8 ఇక తగ్గింపులుండవ్.. వరుస వడ్డింపులే..!
8 జీడీపీ వృద్ధి అంచనా 7.1 శాతానికి పెంపు
8 5.2 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం అంచనా
8 సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ
8 డిసెంబరు 2-4 తేదీల్లో తదుపరి సమీక్ష
ముంబై: ఇప్పటికే మార్కెట్లో ధరలు మండిపోతున్నాయ్.. ఇక రుణాలు సైతం ప్రియం కానున్నాయి. కొత్తగా తీసుకోబోయే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లతోపాటు ఇదివరకే తీసుకున్న అప్పులపై నెలవారీ కిస్తీ చెల్లింపుల (ఈఎంఐ) భారం కూడా పెరగనుంది. ఎందుకంటే, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణాల వడ్డీ రేట్లకు ప్రామాణికమైన రీపర్చేజింగ్ (రెపో) రేటును ఆర్‌బీఐ 0.25 శాతం పెంచింది. దాంతో రెపో రేటు 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం దాదాపు నాలుగేళ్లలో (2023 ఫిబ్రవరి తర్వాత) ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబరులో బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి రెపో పెంపు. పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన చమురు ఇతర కమోడిటీల ధరలు.. తత్ఫలితంగా పెరుగుతున్న ఆహారం, ఇతర ఉత్పత్తుల ధరలు, రూపాయి క్షీణత, లోటు వర్షపాతం, ఎల్‌నినో పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఈనెల 5 నుంచి మూడ్రోజుల పాటు సమావేశమైన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ).. వేగంగా పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు రెపో రేటును పావు శాతం పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంతేకాదు, ఈ ప్రామాణిక రేటుపై ఇప్పటివరకు తటస్థ వైఖరితో ఉన్న ఆర్‌బీఐ.. ఇక ‘క్రమానుగత కఠిన’ వైఖరిని అనుసరించనున్నట్లు తెలిపింది. ధరలను కట్టడి చేసేందుకు అవసరమైతే రెపో రేటును మరింత పెంచనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది. అయితే, కఠిన వైఖరి విషయంలో ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు మాత్రమే మొగ్గుచూపగా ఇద్దరు విబేధించారు.
వృద్ధికి లేదు ఢోకా: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశ ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించిన ఆర్‌బీఐ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) జీడీపీ వృద్ధి రేటు అంచనాను మాత్రం 7.1 శాతానికి పెంచింది. గతంలో అంచనా వేసిన 6.7 శాతం వృద్ధితో పోలిస్తే 0.40 శాతం అధికమిది.
కోరలు చాస్తున్న ధరలు
ఆహార పదార్థాలతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు క్రమంగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటు అంచనాను గతం లో ప్రకటించిన 5 శాతం నుంచి 5.2 శాతానికి పెంచింది. పశ్చిమాసియా సంక్షోభంతో చమురు ఇతర కమోడిటీల ధరలు భారీగా పెరగడం, రూపాయి క్షీణతతో పాటు లోటు వర్షపాతం, ఎల్‌నినో పరిస్థితుల కారణంగా సరఫరా వ్యవస్థపై ఒత్తిళ్లతో మున్ముందు ద్రవ్యోల్బణం మరింత ఎగబాకవచ్చని హెచ్చరించింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ జూలైలో 4.5 శాతంగా నమోదు కాగా.. ఆగస్టులో 4.8 శాతానికి ఎగబాకింది. డిసెంబరుతో ముగియనున్న మూడో త్రైమాసికానికి ద్రవ్యోల్బణ సగటు 6 శాతానికి ఎగబాకవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో మళ్లీ 5.7 శాతానికి తగ్గవచ్చంటోంది.
రూపాయిని స్థిరీకరిస్తాం..
కరెన్సీ మారకం విలువలో హెచ్చుతగ్గులను తగ్గించడం ద్వారా రూపాయిని స్థిరపడేలా చూస్తామని సంజయ్ మల్హోత్రా అన్నారు. స్వల్పకాలంలో రూపాయి ఊగిసలాడినప్పటికీ, దీర్ఘకాలంలో సరైన విలువకు చేరుకునేందుకు ఆర్‌బీఐ మద్దతుగా నిలుస్తుందన్నారు.
మరో 0.75% వరకు పెంపు!
ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి నియంత్రించేందుకు డిసెంబరు సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును మరో 0.50 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వచ్చే రెండు సమీక్షల్లో 0.25 శాతం చొప్పున మొత్తం అర శాతం పెంచే అవకాశాలున్నాయని మరి కొందరు అభిప్రాయపడ్డారు. దాంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా (2027 మార్చి 31) రెపో రేటు 6 శాతానికి చేరుకోవచ్చని అంచనా. కాగా, వచ్చే మరికొద్ది నెలల్లో ఆర్‌బీఐ రెపో రేటును 0.50-0.75 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త సాక్షి గుప్తా అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం, గరిష్ఠ స్థాయి చమురు సెగలు దీర్ఘకాలం కొనసాగితే ఆర్‌బీఐ మరింత దూకుడుగా వడ్డీ రేట్లను పెంచవచ్చని కూడా అన్నారు.

డిసెంబరు నుంచి సీఏఎస్!
ఒకే స్టేట్‌మెంట్‌లో ఆర్థిక చిట్టా
ఆర్‌బీఐ మరో విప్లవాత్మక సంస్కరణకు సిద్ధమవుతోంది. ఏదైనా డిపాజిటరీ సంస్థ వద్ద డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు. మీ పేరు మీద ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, రుణ పత్రాలు, ఈపీఎఫ్‌ల వివరాలతో పాటు మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మీ డిపాజిట్ల వివరాలన్నీ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (సీఏఎస్) రూపంలో ఒకేసారి ఒకే స్టేట్‌మెంట్ ద్వారా తెలుసుకునే విధానం ప్రవేశపెట్టబోతోంది. ఎన్ని డిపాజిటరీ సంస్థల్లో డీమ్యాట్ ఖాతాలు ఉన్నా, ఆ ఖాతాల్లో ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ వివరాలన్నీ ఈ ఒక్క సీఏఎస్ స్టేట్‌మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ డీమ్యాట్ ఖాతా లేకపోయినా చింతించాల్సిన పని లేదు. ఆర్‌బీఐ వద్ద నమోదైన ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ అకౌంట్ అగ్రిగేటర్ దగ్గరికి వెళ్లి ఏయే బ్యాంకులో మీ పేరు మీద ఎన్ని డిపాజిట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు పొక్కుతుందని భయపడాల్సిన పని లేదు. మీ అనుమతి లేకుండా ఏ ఎన్‌బీఎఫ్‌సీ అకౌంట్ అగ్రిగేటర్.. ఆర్థిక ఆస్తుల వివరాలను ఇతరులకు వెల్లడించే అవకాశం ఉండదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది డిసెంబరు నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
విదేశీ ఆదాయంపై వ్యక్తులకు ఊరట
వ్యక్తిగత ఎగుమతి, దిగుమతిదారులకు ఆర్‌బీఐ పెద్ద ఊరట కల్పించింది. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయ వివరాలను తమకు నివేదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒక్కో బిల్లుపై వచ్చే ఎగుమతి దిగుమతి ఆదాయం రూ.10 లక్షల వరకు ఉన్న సంస్థలకూ ఈ మినహాయింపు లభిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. కంపెనీలు ఎగుమతి, దిగుమతుల ద్వారా ఆర్జించే ఆదాయ వివరాలను ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని ఆర్‌బీఐ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై ఉన్న సందేహాలు, అపోహలు తీర్చేందుకు త్వరలోనే తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) పేరుతో ఒక పుస్తకం ప్రచురిస్తామని మల్హోత్రా చెప్పారు.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ప్రభావం ఉండదు..
ఈ నెల 15 నుంచి రూ.2,000కు పైగా విలువైన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను విధించనున్నారు. అయితే, ఎండీఆర్ అత్యల్ప రుసుము అని, యూపీఐ లావాదేవీలపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా అన్నారు.
కొంతకాలం పాటు రేట్ల తగ్గింపులుండవు. ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితులు, భవిష్యత్ ముఖచిత్రం ఆధారంగా మున్ముందు సమీక్షల్లో రెపో రేటును పెంచడం లేదా యథాతథంగా కొనసాగించడం జరుగుతుంది.
సంజయ్ మల్హోత్రా, ఆర్‌బీఐ గవర్నర్
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి