Share News

వెనెజువెలా చమురు కొనుగోలు.. రిలయన్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్!

ABN , Publish Date - Feb 13 , 2026 | 07:40 PM

వెనెజువెలా చమురును నేరుగా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అమెరికా జనరల్ లైసెన్స్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

వెనెజువెలా చమురు కొనుగోలు.. రిలయన్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్!
Reliance Industries - Venezuela Oil Purchase License

ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురును కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అమెరికా జనరల్ లైసెన్స్‌ను జారీ చేసినట్టు తెలిసింది. ఆంక్షల అడ్డంకులు లేకుండా చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ లైసెన్స్‌ను జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జనరల్ లైసెన్స్‌ ఉన్న సంస్థలు వెనెజువెలా చమురు కొనుగోలు, ఎగుమతి, రిఫైనింగ్ కార్యకలాపాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా స్పందించాల్సి ఉంది. అమెరికా ప్రభుత్వం కూడా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, అంతర్జాతీయ చమురు వాణిజ్య సంస్థలు విటోల్, ట్రాఫిగురా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ జనవరిలో సుమారు 2 మిలియన్ బారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. తాజా జనరల్ లైసెన్స్ తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నేరుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేయొచ్చు. దీంతో, మరింత తక్కువ ధరకు రిలయన్స్‌కు ఈ చమురు అందుబాటులోకి రానుంది.


రష్యా చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాన్ని అమెరికా ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఇకపై భారత్ వెనెజువెలా చమురును కొనుగోలు చేస్తుందని అప్పట్లో అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇక 2025 తొలినాళ్లల్లో కూడా వెనెజువెలా చమురును భారత రిఫైనరీలు కొనుగోలు చేశాయి. ఆ తరువాత అమెరికా ఆంక్షలు విధించడంతో ఈ వాణిజ్యానికి బ్రేక్ పడింది.


ఈ వార్తలూ చదవండి:

వారాంతంలో భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌తో ఎన్‌టీటీ డేటా జట్టు

Updated Date - Feb 13 , 2026 | 07:49 PM