ఏఐ ఆధారిత డేటా కేంద్రాలపై రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:36 AM
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా...
రిలయన్స్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా కేంద్రాలపైనా దృష్టి పెడుతోంది. ఇందుకోసం వచ్చే ఏడేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు సామాజిక మాధ్య మం ‘ఎక్స్’లో ఆర్‌ఐఎల్ పోస్టు చేసింది. ‘మా కంపెనీ ఇప్పటికే రిఫైనింగ్, పెట్రో రసాయనాల కంపెనీ స్థాయి నుంచి చైర్మన్ ముకేశ్ అంబానీ మార్గదర్శకంలో ఇంధనం, డిజిటల్ సేవలు, రిటైల్, మీడియా, హరిత ఇంధన టెక్నాలజీ రంగాల్లో ప్రపంచంలోనే మేటి కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు కొత్తగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో అత్యధిక గిగావాట్ల సామర్థ్యం ఉండే ఏఐ ఆధారిత డేటా కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం’ అని రిలయన్స్ ఆ పోస్టులో పేర్కొంది.
ముందు చూపుతోనే: నిజానికి ముకేశ్ అంబానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు’లోనే ఈ విషయం చూచాయగా ప్రకటించారు. ‘ఇదేదో ఊహాజనిత లేదా కంపెనీ వాల్యుయేషన్ పెంచుకునేందుకు చేసే తొందరపాటు పెట్టుబడి కాదు. కొన్ని దశాబ్దాల పాటు మన్నికైన దేశ ఆర్థిక అభివృద్ధి, వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓర్పు, క్రమశిక్షణతో చేసే పెట్టుబడులు’ అని అంబానీ ఆ సదస్సులోనే ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచంలో అనేక దిగ్గజ కంపెనీలు చైనా ప్లస్ వన్ అనే వ్యూహాంలో భాగంగా తమ ఏఐ ఆధారిత డేటా కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తన భారీ డేటా కేంద్రాన్ని వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి డేటా కేంద్రాలకు అవసరమైన ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలు అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమతోంది.
ఎన్‌ఎల్‌సీతో లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు: ఏఐ ఆధారిత డేటా కేంద్రాలతో పాటు లిగ్నైట్ ఆధారిత భూగర్భ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల పైనా ఆర్‌ఐఎల్ ఆసక్తి చూపిస్తోంది. గుజరాత్‌లో ఇలాంటి ఒక ప్రాజెక్టు ఏర్పాటుకు ఉన్న అవకాశాల పరిశీలన కోసం ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎల్‌సీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు రూ.37,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిఽధి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే