యుద్ధం.. క్షామం!
ABN , Publish Date - May 30 , 2026 | 02:45 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల దృక్పథంతోనే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో సంక్షోభంతో పెరిగిన ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థలో...
పశ్చిమాసియా సంక్షోభంతో ఆర్థిక వృద్ధికి గండం..
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌పై డబుల్ ఇంపాక్ట్
‘ఎల్ నినో’ ప్రభావంతో వ్యవసాయ ఉత్పత్తికి గండి
వార్షిక నివేదికలో హెచ్చరించిన ఆర్‌బీఐ
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల దృక్పథంతోనే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో సంక్షోభంతో పెరిగిన ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు ఆర్థిక పురోగతికి ప్రతిబంధకంగా మారటంతో పాటు ద్రవ్యోల్బణం అదుపు తప్పవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) హెచ్చరించింది. అలాగే, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం సాధారణ స్థాయి కంటే తగ్గవచ్చన్న అంచనాల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తికి కూడా గండి పడవచ్చని శుక్రవారం విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సర నివేదికలో ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ, కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల మెరుగైన పనితీరు, ప్రభుత్వ మూలధన పెట్టుబడులు, అమెరికా సహా కీలక భాగస్వాములతో వాణిజ్య ఒప్పందాలు జీడీపీ వృద్ధి, పెట్టుబడుల జోరు కొనసాగేందుకు దోహదపడవచ్చని ఆర్‌బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ అనిశ్చితులోనూ భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో చురుకుగా పురోగమించిందని.. సమృద్ధిగా వస్తు వినియోగం, పెట్టుబడులతో పాటు బలమైన ఆర్థిక మూలాలు ఇందుకు తోడ్పడ్డాయని రిపోర్టు పేర్కొంది.
జీడీపీ వృద్ధి 6.9 శాతం, ద్రవ్యోల్బణం 4.6 శాతం.
ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నమోదవడంతో పాటు ఎల్ నినో అవకాశాలున్నప్పటికీ సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు, నీటి రిజర్వాయర్ స్థాయిల సాయంతో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా ఉండవచ్చని ఆర్‌బీఐ రిపోర్టు పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారీగా పెరిగిన ఇంధన, కమోడిటీ ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2026-27లో సగటు ద్రవ్యోల్బణాన్ని అప్‌సైడ్ రిస్క్‌తో 4.6 శాతంగా అంచనా వేసింది. అలాగే, జీడీపీ వృద్ధి రేటును డౌన్‌సైడ్ రిస్క్‌తో 6.9 శాతంగా అంచనా వేసింది.
ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 20.6% వృద్ధి
2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.76,25,421.93 కోట్లుగా ఉన్న ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి రూ.15,71,699.15 కోట్ల (20.6 శాతం) పెరుగుదలతో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా పెట్టుబడులు 44.9 శాతం, పసిడిలో పెట్టుబడులు 63.8 శాతం, విదేశీ పెట్టుబడులు 7.9 శాతం పెరగడం ఇందుకు దోహదపడిందని వెల్లడించింది.
విదేశీ మారక లావాదేవీల నుంచి..
రూ.1.69 లక్షల కోట్ల ఆదాయం..
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐకి విదేశీ మారకం (ఫారెక్స్) లావాదేవీలపై ఆదాయం దాదాపు 52 శాతం వృద్ధితో రూ.1.69 లక్షల కోట్లకు పెరిగింది. 2024-25లో రూ.1.11 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, 2025-26లో విదేశీ సెక్యూరిటీలపై గడించిన వడ్డీ ఆదాయం రూ.1.07 లక్షల కోట్లకు చేరుకుంది.
డిజిటల్ రూపీ చెలామణి తగ్గింది..
చలామణిలో ఉన్న రిటైల్ డిజిటల్ రూపీ (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ) గత ఆర్థిక సంవత్సరంలో 24.08ు తగ్గి రూ.771.66 కోట్లకు పరిమితమైంది. 2024-25లో ఈ విలువ రూ.1,016.46 కోట్లుగా ఉంది. టోకు డిజిటల్ రూపీ చలామణి మాత్రం సున్నాగా ఉంది. డిజిటల్ రూపీతో విదేశీ లావాదేవీలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ లావాదేవీలకూ డిజిటల్ రూపీని అందుబాటులో తేవాలని ఆర్‌బీఐ భావిస్తోంది. అలాగే, కేంద్రం, రాష్ట్రాలకు చెందిన మరిన్ని ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, దేశీయంగా రిటైల్ లావాదేవీల్లోనూ డిజిటల్ రూపీని వినియోగించాలని యోచిస్తున్నది.
రూ.48,021 కోట్ల బ్యాంకింగ్ మోసాలు
గత ఆర్థిక సంవత్సరం దేశీయ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో రూ.48,021 కోట్ల విలువైన 10,114 మోసాలు జరిగాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.32,803 కోట్ల విలువ చేసే 23,722 మోసం కేసులు నమోదయ్యాయి. గత మూడేళ్ల డేటాను పరిశీలిస్తే.. మోసం కేసుల సంఖ్య తగ్గుతుండగా.. మోసపోయిన సొమ్ము విలువ గణనీయంగా పెరిగిందని పేర్కొంది.
880.52 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు
ఆర్‌బీఐ వద్దనున్న బంగారం నిల్వలు 2025 మార్చి 31 నాటికి 879.58 మెట్రిక్ టన్నులుగా నమోదు కాగా.. 2026 మార్చి 31 నాటికి 880.52 టన్నులకు పెరిగాయి. అంటే, గత ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ కేవలం 0.94 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
రూ.500, రూ.200 నోట్లకు నకిలీ బెడద
గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ రంగంలో గుర్తించిన నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 5.7 శాతం పెరిగిందని.. అందులో అధికం రూ.500, రూ.200 నోట్లేనని ఆర్‌బీఐ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,17,396 నకిలీ నోట్లను గుర్తించగా.. 2025-26లో ఈ సంఖ్య 2,29,746కు పెరిగింది. అందులో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 20.5 శాతం పెరుగుదలతో 1,41,907కు చేరింది. 2024-25లో 1,17,722 నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరం చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 11.2 శాతం పెరిగి 7,05,482 లక్షలకు చేరుకుంది. విలువపరంగా చూస్తే, రూ.35.27 లక్షల కోట్లకు పెరిగింది.
రూపాయల్లో ఎగుమతి, దిగుమతులు
ఎగుమతి, దిగుమతి లావాదేవీల్లో రూపాయి వినియోగం గణనీయంగా పెరిగిందని ఆర్‌బీఐ వెల్లడించింది. రూపాయి అంతర్జాతీయీకరణకు గడిచిన కొన్నేళ్లలో ఆర్‌బీఐ చేపట్టిన పలు చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. 2022-2025 మధ్యకాలంలో దిగుమతులకు రూపాయల్లో ఇన్వాయి్‌సలు 20.9 శాతం చొప్పున, ఎగుమతులకు రూపీ ఇన్వాయి్‌సలు 12.7 శాతం చొప్పున పెరిగాయి. 2025-26లో ఎగుమతులకు రూపీ ఇన్వాయిసింగ్ 6.5 శాతం, రూపాయల్లో సెటిల్‌మెంట్ 2.7 శాతం పెరగగా.. దిగుమతులకు రూపాయల్లో ఇన్వాయిసింగ్ 9.5 శాతం, రూపాయల్లో సెటిల్‌మెంట్ 41.2 శాతం పెరిగింది. విలువపరంగా, 2025-26లో దిగుమతుల్లో రూపీ ఇన్వాయిసింగ్ రూ.2.85 లక్షల కోట్లకు, ఎగుమతుల్లో రూ.3.27 లక్షల కోట్లకు పెరిగింది. దిగుమతులకు రూపాయల్లో సెటిల్‌మెంట్ రూ.1.60 లక్షల కోట్లకు, ఎగుమతుల విషయంలో రూ.1.72 లక్షల కోట్లకు పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు