బ్యాంక్ శాఖల ద్వారా నగదు బదిలీకి కొత్త నిబంధనలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:59 AM
దేశంలో బ్యాంకుల ద్వారా వ్యక్తుల మధ్య జరిగే చిన్న చిన్న నగదు బదిలీలను ఆర్‌బీఐ సులభతరం చేసింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ...
వాక్ ఇన్ ఖాతాదారులు రూ.50,000 వరకు పంపే సౌలభ్యం
ముంబై: దేశంలో బ్యాంకుల ద్వారా వ్యక్తుల మధ్య జరిగే చిన్న చిన్న నగదు బదిలీలను ఆర్‌బీఐ సులభతరం చేసింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ (దేశీయ నగదు బదిలీ) ఆదేశాలు, 2026 పేరుతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆర్‌బీఐ తెలిపింది. అయితే కార్డు టు కార్డు ద్వారా జరిగే నగదు బదిలీలు ఈ ఆదేశాల పరిధిలోకి రావని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వలస కూలీలు, కార్మికులకు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అయితే అసాంఘిక శక్తులు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు ఎవరి ఖాతాలోనైనా అసాధారణ స్థాయిలో నగదు డిపాజిట్ అవుతుంటే బ్యాంకులు వెంటనే దర్యాప్తు చేసి వాటి నిగ్గు తేల్చాలని స్పష్టం చేసింది.
ఆర్‌బీఐ ఆదేశాల ప్రధాన అంశాలు: ఎలాంటి బ్యాంకు ఖాతా లేని వాక్ ఇన్ ఖాతాదారులు, నేరుగా బ్యాంకుల శాఖలకు వెళ్లి ‘నెఫ్ట్’ ద్వారా రూ.50,000 వరకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయవచ్చు. ఇలా నగదు బదిలీ చేసేటప్పుడు బ్యాంకులు వాక్ ఇన్ కస్టమర్, లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించుకోవాలి.
బ్యాంకు కరస్పాండెంట్లు, ఏటీఎంల ద్వారా కూడా వాక్ ఇన్ కస్టమర్లు లబ్ధిదారులకు నెలకు రూ.25,000 మించకుండా ఒక్కో లావాదేవీ ద్వారా రూ.5,000 వరకు నగదు బదిలీ చేయవచ్చు.
బ్యాంకులు తమ ఖాతాదారుల ఖాతాల నుంచి క్యాష్ పే ఔట్ ద్వారా, బ్యాంకు ఖాతాలేని లబ్ధిదారులకు ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్లు లేదా ఇతర అధీకృత పేమెంట్ ఛానల్స్ ద్వారా నెలకు రూ.25,000 మించకుండా ఒక్కో లావాదేవీ ద్వారా రూ.10,000 వరకు నగదు బదిలీ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?