Share News

ఈసారికి రెపో యథాతథమే!

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:46 AM

నూతన ఆర్థిక సంవత్సరాని(2026-27)కి ప్రకటించనున్న తొలి పాలసీలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని...

ఈసారికి రెపో యథాతథమే!

నేడే ఎంపీసీ సమావేశం షురూ

ముంబై: నూతన ఆర్థిక సంవత్సరాని(2026-27)కి ప్రకటించనున్న తొలి పాలసీలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆర్థికవేత్తలంటున్నారు. పశ్చిమాసియా సంక్షోభంతో రిటైల్‌ ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చే పరిస్థితి ఉన్న కారణంగా ఆర్‌బీఐ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి అవలంబించవచ్చన్నది వారి అభిప్రాయం. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో కమోడిటీ ధరల్లో భారీ ఆటుపోట్లు నమోదవుతున్నాయి. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చుకుంటుందని, వృద్ధి రేటు క్షీణిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. రెపో రేటులో యథాతథ స్థితిని కొనసాగించేందుకు ఇవన్నీ దోహదకారులేనని 12 మందికి పైగా ఆర్థికవేత్తలతో నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నాయకత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సోమవారం సమావేశం కానుంది. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితితో పాటు అంతర్జాతీయ పరిణామాలు, ఇతరత్రా అంశాలపై రెండు రోజుల పాటు లోతుగా సమీక్షించిన అనంతరం బుధవారం ఉదయం ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ ఏడాదికి తొలి ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్నారు.

ప్రస్తుత రెపో రేటు 5.25 శాతం: ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో వృద్ధికి ఊతం ఇచ్చేందుకు గత ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 1.25ు మేరకు తగ్గించింది. ప్రస్తుతం రెపోరేటు 5.25ు వద్ద ఉంది. అయితే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ మధ్యకాలిక లక్ష్యం 4 శాతానికి చేరువలో ఉండడంతో పాటు ప్రపంచ విపణిలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 100 డాలర్ల కన్నా పైనే కదలాడుతున్న స్థితిలో రెపో రేటుపై ఆర్‌బీఐ ఆచితూచి వ్యవహరించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. క్రూడాయిల్‌ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు ద్రవ్యోల్బణం 0.60ు మేరకు పెరుగుతుందని అంచనా. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి డాలర్‌ మారకంలో రూపాయి 4ు మేరకు దిగజారింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ఈ విడత సమావేశంలో ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలను పునఃసమీక్షించవచ్చని పలువురు ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి ఊతం ఇవ్వడం కన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇవ్వొచ్చని కూడా వారంటున్నారు. అలాగే రెపో రేట్ల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న తటస్థ వైఖరిని యథాతథంగా కొనసాగించవచ్చన్నది కూడా వారి అభిప్రాయం.


ఈ ఏడాది భారత వృద్ధి 6 శాతమే: మూడీస్‌

పశ్చిమాసియా యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుందని రేటింగ్‌ సంస్థ మూడీస్‌ వెల్ల్లడించింది. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా రవాణా, దిగమతి ఖర్చుల కారణంగా నిత్యావసర ఉత్పత్తులకు కొరత ఏర్పడనుందని పేర్కొంది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఏకంగా 4.8 శాతానికి చేరుకోవచ్చని మూడీస్‌ అంచనా వేసింది. ఇన్‌పుట్‌ ఖర్చుల పెరుగుదల, ప్రైవేట్‌ వినియోగం మందగించడం, పరిశ్రమల కార్యకలాపాలు నెమ్మదించడం, పెట్టుబడుల వేగం తగ్గడం వంటివి వృద్ధిని ప్రభావితం చేసే అంశాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 06 , 2026 | 02:46 AM