Share News

రూపాయికి ఆర్‌బీఐ చేయూత

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:53 AM

రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శనివారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు...

రూపాయికి ఆర్‌బీఐ చేయూత

ఇంధన విక్రయ కంపెనీల కోసం ప్రత్యేక డాలర్‌ విండో

ఫారెక్స్‌ డెరివేటివ్‌ ట్రేడింగ్‌

నిబంధనలు కఠినతరం

ముంబై: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శనివారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు (ఓఎంసీ) చమురు దిగుమతికి రోజువారీగా అవసరమయ్యే డాలర్ల కోసం స్పాట్‌ మార్కెట్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక డాలర్‌ విండోను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 12 నుంచి ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి రానుంది. నిర్దేశిత బ్యాంకుల ద్వారా ఆర్‌బీఐ డాలర్లను ఓఎంసీలకు విక్రయించనుంది.ఎందుకంటే, మొత్తం దేశ దిగుమతుల్లో ముడి చమురు వాటాయే 25 శాతం వరకు ఉంటుంది. ఓఎంసీలు చమురు దిగుమతి కోసం స్పాట్‌ మార్కెట్‌ నుంచి భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండటంతో రూపాయి మారకం విలువ క్షీణత, తీవ్ర హెచ్చుతగ్గులకు కారణమవుతోంది.

  • రూపాయిపై స్పెక్యులేటివ్‌ పెట్టుబడులను నిరోధించేందుకు ఆర్‌బీఐ.. ఫారెక్స్‌ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ నిబంధనలను కూడా కఠినతరం చేసింది. రద్దయిన, రూపాయికి సంబంధించిన ఫారెక్స్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టును ట్రేడర్లు తిరిగి బుక్‌ చేసుకునేందుకు అధీకృత డీలర్లు (ఏడీ) అనుమతించరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. అయితే, ఫారెక్స్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత రోల్‌ఓవర్‌కు మాత్రం అనుమతించవచ్చని స్పష్టం చేసింది. అలాగే, అంతర్లీన ఆస్తి ఉనికిని నిర్ధారించకుండా ఫారెక్స్‌ డెరివేటివ్‌ పొజిషన్లు తీసుకోగలిగే పరిమితిని 10 కోట్ల డాలర్ల నుంచి ఏకంగా 50 లక్షల డాలర్లకు తగ్గించింది. భారీ పెట్టుబడులు పెట్టే హెడ్జ్‌ ఫండ్ల స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

  • 20 లక్షల డాలర్లకు పైగా రూపాయికి సంబంధించిన ఫారెక్స్‌ డెరివేట్‌ కాంట్రాక్టుల కొనుగోళ్లకు 20 శాతం ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రిస్క్‌ రిజర్వ్‌ను ఏర్పాటు చేయాలని కూడా బ్యాంకులను ఆర్‌బీఐ నిర్దేశించింది. ఈ రిస్క్‌ రిజర్వ్‌ను భారత్‌లో నగదు రూపం లో ఆర్‌బీఐ వద్ద రోజువారీగా జమ చేయాల్సి ఉంటుంది. అలాగే, కాంట్రాక్టు ముగిసే వరకు రిజర్వ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..

ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 11 , 2026 | 05:53 AM