Share News

ఆర్థిక ముప్పులపై సదా అప్రమత్తం

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:21 AM

ఆర్థిక సేవల రంగంపై ఒత్తిడి ఆకస్మికంగా పెరగవచ్చని, ఒక్కోసారి ఆ సమస్యను పరిష్కరించేందుకు సంవత్సరాలు పట్టవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ఆర్థిక సేవల వ్యవస్థ నేడు...

ఆర్థిక ముప్పులపై సదా అప్రమత్తం

  • ఆర్థిక స్థిరత్వ రక్షణకు కట్టుబడి ఉన్నాం..

  • నేటి బలం రేపటి రిస్క్‌ నుంచి గట్టెక్కించలేకపోవచ్చు

  • ఆకస్మికంగా ఎదురయ్యే సమస్యను పరిష్కరించేందుకు ఏళ్లు పట్టొచ్చు

  • యుద్ధం, సైబర్‌ దాడి, సాంకేతిక వైఫల్యంతో ఆర్థిక సంక్షోభాలకు అవకాశం

  • కౌటిల్య ఎకనామిక్‌ కాంక్లేవ్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగంపై ఒత్తిడి ఆకస్మికంగా పెరగవచ్చని, ఒక్కోసారి ఆ సమస్యను పరిష్కరించేందుకు సంవత్సరాలు పట్టవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ఆర్థిక సేవల వ్యవస్థ నేడు కలిగి ఉన్న స్థితిస్థాపకత, పటిష్ఠత.. భవిష్యత్‌ బలహీనతల నుంచి గట్టెక్కించ లేకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ఆర్థిక స్థిరత్వాన్ని రక్షించేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదో కౌటిల్య ఎకనామిక్‌ కాంక్లేవ్‌లో శనివారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గడిచిన రెండు దశాబ్దాల అనుభవం మాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. బ్యాంకింగ్‌ రంగంలో ఒత్తిడి ఉన్నట్టుండి పెరిగి, పరిష్కృతం కావడానికి ఏళ్ల సమయం పట్టవచ్చు. 2000 తొలినాళ్లలో వెలుగుచూసిన మోతాదుకు మించిన రుణాల మంజూరు, మొండిబాకీల (ఎన్‌పీఏ) సమస్యను పరిష్కరించేందుకు దాదాపు పదేళ్లు పట్టింది. అందుకే నిశ్చింతగా ఉండలేం. ఆర్థిక సేవల రంగంలో బలహీనతల వృద్ధికి తావిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద’’ని మల్హోత్రా అన్నారు.

పశ్చిమాసియా సంక్షోభంతో బలహీనతలు పెరిగాయ్‌

వ్యవస్థలో బలహీనతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఆర్థిక సేవల రంగాన్ని పటిష్ఠంగా, స్థితిస్థాపకంగా ఉంచేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందని మల్హోత్రా అన్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల మెరుగైన బ్యాలెన్స్‌ షీట్లతో ఆర్థిక సేవల రంగం ప్రస్తుతం బలంగానే ఉందన్నారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని మన ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలిగిందని, చురుకుగా వృద్ధి చెందుతున్నదని అన్నారు. కానీ, ఈ సంక్షోభం ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను, ఆర్థిక సేవల వ్యవస్థలో బలహీనతలను పెంచిందన్నారు.

ముప్పును తట్టుకోవడంపై దృష్టిపెట్టాలి..

ఆర్థిక స్థిరత్వం కోసం ఆకస్మిక ముప్పులను నిరోధించడం పైన కాకుండా వాటిని తట్టుకుని, స్వల్ప ప్రభావంతో గట్టెక్కగలిగేలా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టిసారించాలని మల్హోత్రా సూచించారు. అంతర్గతమైనా లేదా బహిర్గతమైనా ప్రతి ముప్పునూ నిరోఽధించడం సాధ్యం కాదు. ఆ ముప్పుతో ఏర్పడే తీవ్ర ఒత్తిడిలోనూ సేవలందించగలిగేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. కొత్త తరం వ్యవస్థాగత ముప్పులు అధికంగా బయట నుంచే పుట్టుకొస్తున్నాయని, మన వ్యవస్థనూ ప్రభావితం చేస్తున్నాయన్నారు. తదుపరి ఆర్థిక సంక్షోభం దేశీయంగా ఏదైనా బ్యాంకు లేదా వ్యవస్థ అంతర్గతంగా ప్రారంభం కాకపోవచ్చు. కానీ, దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైబర్‌ దాడి, సాంకేతిక వైఫల్యంతో మొదలు కావచ్చు. పలు మార్గాల్లో మన ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేయవచ్చని గవర్నర్‌ అన్నారు.


అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు 5 ముప్పులు

భారీగా పెరుగుతూ పోతున్న ప్రభుత్వ అప్పులు, ఆస్తుల విలువల్లో బుడగ ఏర్పడుతుండటం, మార్కెట్లో రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెరుగుతుండటం, ప్రైవేట్‌ క్రెడిట్‌ రిస్క్‌లు, కృత్రిమ మేధతో పెరిగిన సైబర్‌ దాడుల భయాల నుంచి అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని గవర్నర్‌ హెచ్చరించారు.

క్రిప్టోకు నో..

ప్రభుత్వ ఆమోదిత కరెన్సీ కాకపోవడంతో బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బీఐ ఇప్పటికీ జాగ్రత్తతో కూడిన వైఖరినే అవలంబిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. అయితే, ఈ క్రిప్టో కరెన్సీల నిర్వహణలో అనుసరిస్తున్న డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌, టోకనైజేషన్‌ వంటి సాంకేతికతలకు మాత్రం ప్రోత్సహిస్తున్నట్లు మల్హోత్రా చెప్పారు.

జియో ఫైనాన్స్‌ ప్లాట్‌ఫామ్‌.. జియోసిల్వర్‌ పథకాన్ని ప్రారంభించింది. జియో యాప్‌ ద్వారా 10తో డిజిటల్‌ సిల్వ ర్‌లో పెట్టుబడులు పెట్టే పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఒక్కో లావాదేవీ ద్వారా 10నుంచి రూ.లక్ష వరకు డిజిటల్‌గా వెండిని కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

ఈ వార్తలూ చదవండి

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఏడు మోసాల పట్ల జాగ్రత్త వహించండి..

క్రిప్టోపై ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం: ఆర్బీఐ గవర్నర్

Updated Date - Oct 04 , 2026 | 05:21 AM